ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నైకి దాదాపు మరో ఓటమి తప్పదు అనుకన్న ఈ మ్యాచ్ లో, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ – శివమ్ దూబే అద్భుతమైన పోరాటం చేశారు.
దీంతో, కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు జల్లిన సీఎస్కే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా, 180 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన సీఎస్కేకి మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డివాన్ కాన్వే ఇద్దరూ డకౌట్ గా వెనుదిరిగారు. ఆ తరువాత వచ్చిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31) రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్ (8), రవీంద్ర జడేజ (19) పరుగులకే ఔటయ్యారు. దీంతో సీఎస్కే కేవలం 5.2 ఓవర్లలోనే 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 50) ధనాధన్ బౌండరీలతో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో డీలా పడ్డ చెన్నై ఒక్కసారిగా పైకి లేచింది.
ఇక మరోఎండ్ లో ఉన్న శివం దూబే నిలకడగా ఆడుతూ.. సపోర్ట్ ఇచ్చాడు. 6వ వికెట్ కు డెవాల్డ్ బ్రెవిస్ – శివమ్ దూబే కలిసి 67 పరుగులు జోడించారు. దాదాపు ఓటమి అంచున ఉన్న చెన్నై జట్టుకు వీరిద్దరూ ఊపిరి పోశారు.
ఇక డెవాల్డ్ బ్రెవిస్ ఔటైన తరువాత వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోని (17 నాటౌట్)తో జతకట్టిన శివం దూబే (40 బంతుల్లో 45) పరుగులకు ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్ కు 43 పరుగులు జోడించారు.
ఆఖరి వరకు క్రీజులో నిలబడిన ధోని.. అన్షుల్ కాంబోజ్ (4 నాటౌట్)తో కలిసి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. 20 ఓవర్లో అన్షుల్ కాంబోజ్ బౌండరీ బాది విన్నింగ్ షాట్ తో ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోర 3 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణ, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక మోయిన్ అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.