మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…

మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…

పిరికిపందల చర్యగా అభివర్ణించిన అమరం జైపాల్ రెడ్డి..

మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది పిరికిపందల ధోరణికి నిదర్శనమని గుండ్లపోచంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ​ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేయడం అత్యంత అభ్యంతరకరమని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, ఒక్క మంచి పని కూడా చేయకపోగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా జరుగుతున్న గ్రామసభల్లో ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ నాయకులను “ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి?” అని నిలదీస్తున్నారని, ఆ అసహనంతోనే ఇప్పుడు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు.

​దాడిని ఖండించిన అమరం జైపాల్ రెడ్డి…

గజ్వేల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యంత అమానుషంగా వ్యవహరించి, మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను, అద్దాలను ధ్వంసం చేయడం వారి అరాచక సంస్కృతిని తెలియజేస్తోందని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే ఇలాంటి దాడులు జరుగుతుంటే, ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​గతంలో తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించకూడదని ఆయన హెచ్చరించారు.

​పోలీసులకు డిమాండ్..

ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించాలని, దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరం జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Leave a Reply