Kavitha | జాగృతి సందోహం గులాబీ సంకటం..

Kavitha | జాగృతి సందోహం గులాబీ సంకటం..
- విచిత్ర వైరంలో విభిన్న వ్యూహం..
- ఎమ్మెల్సీ కవిత తీరుతో గులాబీ శ్రేణుల్లో అలజడి
- బీఆర్ఎస్ కీలక నాయకులే లక్ష్యంగా ఆరోపణాస్త్రాలు
- అగ్రనేతలపై అవినీతి ముద్ర
- అధఃపాతాళానికి నెట్టే యోచన
- అప్రమత్తత.. గులాబీ పార్టీకి అనివార్యమని
- రాజకీయ విశ్లేషకుల సూచన
Kavitha, హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు పార్టీలో కాకలు రేపుతోంది. ఆమె సంధిస్తున్న వాగ్బాణాలు గులాబీ పార్టీ శ్రేణులను కకావికలం చేస్తున్నాయి. విచిత్రమైన వైరంతో విభిన్న వ్యూహాన్ని అనుసరిస్తూ, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని కవిత ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏ కొత్త రాజకీయ పార్టీ, రాజకీయ సంస్థ, ప్రజా సంఘాలు పుట్టుకొచ్చినా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల పై యుద్ధం ప్రకటించడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ అందుకు భిన్నంగా బీఆర్ఎస్ కీలక నేతలు, అధిష్టాన పెద్దలకు సన్నిహితులుగా భావించే కీలక సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకొని కవిత విమర్శలకు దిగడం, అవినీతి అక్రమార్జనలకు పాల్పడ్డారని వివరిస్తూ తనదైనశైలిలో ధ్వజమెత్తుతుండటం గులాబీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
పార్టీ అధినేత, తండ్రి కేసీఆరు (KCR) తెలియకుండానే పార్టీలో ఉన్న కీలక నేతలు ద్వంద వైఖరితో ముందుకు సాగుతున్నారని, పార్టీ ఓటమి కోసం కుట్రలు చేశారం టూ ఆమె ఆరోపించడం కూడా పార్టీ శ్రేణుల ఆందోళనకు కారణ మవుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదం టూ కవితను ఆ పార్టీ సస్పెండ్ చేయగా, నాటి నుంచి ప్రజల మధ్యలోకి వెళ్తూ, కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలను రేకెత్తిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తు న్నారు. పార్టీ అధిష్టాన పెద్దలుగా ఉన్న కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని, వారి సన్నిహితులుగా మెలిగే సీనియర్లను దెబ్బకొట్టాలన్న సరికొత్త వ్యూహరచనతో ఆమె ముందుకు సాగుతున్నారు.
సాధారణంగా కొత్తగా ఏర్పాటయ్యే ఏ రాజకీయ పార్టీకైనా, ప్రజా సంఘాలకైనా అధికార పార్టీ వైఫల్యాలను ప్రస్తావించడం, పాలక వర్గాలు చేస్తున్న తప్పిదాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ప్రధాన అస్త్రాలుగా ఉంటాయి. వాటినే ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఆయా సంఘాలు, పార్టీల నాయకులు యత్నించడం సర్వసాధారణం. అయితే.. అందుకు భిన్నంగా తన మాతృసంస్థ బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని పార్టీ నాయకుల వ్యక్తిగత అవినీతిని విమర్శనాస్త్రాలుగా కవిత సంధిస్తున్నారు. ఇంతకాలం ఆ పార్టీలో పవర్ సెంటర్గా భావించిన కవిత నుంచి ఈ రకమైన వ్యతిరేక భావజాలం, జైలు నుంచి విడుదలైన అనంతరం కుటుంబానికి దూరమైన కవిత, అనేక సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ జన జాగృతిని ప ఎనరుద్ధరించి, బలోపేతం చేసే ఆలోచనతో కవిత జిల్లాల వారిగా పర్యటనలు చేస్తూ వస్తున్నారు. పాతతరం జాగృతి నాయకులను కలుపుకొంటూ, ఉద్యమకాలంలో పార్టీలో పని చేసి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వారిని పోగేసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, బంగారు తెలంగాణ పేరుతో వచ్చిన నేతల విధానాలను తట్టుకోలేక, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కలిసిరాని వారితో జాగృతిని విస్తృత పరిచే వ్యూహంతో కవిత అడుగులు వేస్తున్నారు.
బీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్రణాళిక
పెద్దగా పట్టించుకోని ప్రజలు, నాయకులపై వ్యక్తిగతంగా వచ్చే అవినీతి, ఆరోపణలను మాత్రం సహించరనడానికి కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు ఆ పార్టీ అధికారంలో ఉండగా వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన కవిత చేస్తున్న ఆరోపణలు, ప్రజల మనస్సుల్లో నాటుకుపోయి, తీవ్ర ప్రభావం చూపే అవకాశా లుంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరుగా కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని కవిత (Kavitha) చేస్తున్న ఆరోపణలను సరైన రీతిలో అడ్డుకోకుంటే, ఇంతకాలం కీలక నేతలుగా ఉన్నవారు ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం ఉందని, కవిత చేస్తున్న ఆరోపణలను ధీటుగా ఎదుర్కొని, నివారణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కవిత చేస్తున్న ఆరోపణలు వైరల్ గా మారుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం మౌనంగా ఉండటం సరికాదని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా కవిత దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.
బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించాల్సిందే.!
బీఆర్ఎస్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, తప్పులు చేశారని ఎత్తిచూపుతూ కవిత సరికొత్త పంథాతో ప్రజల్లోకి వెళుతున్నారు. అటు అధికార కాంగ్రెస్, మరో ప్ర ధాన పార్టీ బీజేపీపై అంతగా విమర్శలు గుప్పించని కవిత, బీఆర్ఎస్ కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు సంధిస్తున్నారు. గులాబీ పార్టీలోని లుకలుకలను ప్రస్తావిస్తూ, జాగృతిని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దుకునేలా ఆమె వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నాటి తరం ఉద్యమకారులను కలుపుకొని పోతామని బహిరంగంగానే ప్రకటించడంతో పాటు బీఆర్ఎస్లో జరిగే అంతర్గత కలహాల కారణంగా పార్టీలో యాక్టివ్ రోల్ పోషించని వారందరినీ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీని వీడిన వారిలో ముఖ్యుల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, వారు వెళ్లిపోవడానికి, గత ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై ఆమె ధ్వజమెత్తుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అసమ్మతి వాదులంతా జాగృతిలోకి వలస వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణులు, కవిత తీరుతో మరింత దిగులు చెందుతున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, పద్మా దేవేందర్ రెడ్డిలతో పాటు మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వారితోపాటు, వరుస క్రమంలో పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేస్తుండటంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
జనాన్ని జాగృతం చేయడమే లక్ష్యంగా..
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించుకొనే లక్ష్యంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన ఉద్యమంలో తెలంగాణ జన జాగృతి కీలక భూమిక పోషించింది. అయితేపదేళ్ల అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, పార్టీ స్టార్ క్యాంపైనర్గా ఎన్నో కీలక బాధ్యతలతో పార్టీలో పవర్ సెంటర్గా ఎదిగిన కవిత, ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపారు.
పార్టీ అగ్రనేతలపై అవినీతి ముద్ర
పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల అధికార వైభోగం ఇవి బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలకు చిరునామా. కానీ గత రెండేళ్ల కాలంలో అనేక ఓటములను చవిచూసిన ఆ పార్టీ ఇప్పటికే తీవ్ర నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకొని గుడి, బడి, చెరువు, శిఖం అనే తేడా లేకుండా ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని, వేలు, లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడి అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకున్నారని కవిత ఆరోపిస్తుండటం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. 2014లో కాంగ్రెస్ పార్టీపై అవినీతి ముద్ర వేయడం ద్వారా సక్సెస్ అయిన బీజేపీ, నేటికీ అధికారంలో కొనసాగుతోంది.
అవినీతి ముద్రను పోగొట్టు కోలేక హస్తం పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమైంది. అనేక రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ముఖ్యంగా ఏ పార్టీ పాలనాకాలంలోనైనా జరిగే వైఫల్యాలు, ప్రభుత్వాల పనితీరుపై సాధారణంగా వచ్చే విమర్శలను కాంగ్రెస్పార్టీ కంటే, బీఆర్ఎస్కే ఎక్కువ నష్టం వాటిల్లే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటంలో అధికార సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణా మాలు, పార్టీ కేడర్కు అధిష్టానం దూరంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంతో పాటు, ఆ పార్టీలోని కీలక నేతలు అవినీతికి పాల్ప డ్డారంటూ కవిత చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ ఉనికికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజాగృతి వైపు కారుపార్టీలోని అసమ్మతివాదులు చూసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సరైన సంస్థాగత నిర్మా ణం లేక అల్లాడుతున్న బీఆర్ఎస్ కు, కవిత రూపంలో పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పార్టీలో అంతర్గత కలహాలు, విధానపరమైన నిర్ణయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, పార్టీ లీడర్లను, కేడర్ ను కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. గులాబీ అధిష్టానం వ్యూహాత్మక మౌనం వహించడం సరికాదని, పార్టీశ్రేణులను కట్టుదిట్టం చేసుకోవడంతో పాటు, లోపాలను సరిదిద్దుకోవడం అత్యంత కీలకమని, విమర్శలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందించుకోవాలని వారు సూచిస్తున్నారు.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి..
