Kagita Krishna Prasad | కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

Kagita Krishna Prasad | కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
Kagita Krishna Prasad | బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరి చేస్తుందన్నారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించటంతో పాటు రాజముద్రతో అందించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు భరోసా కలిగిస్తాయన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్ లో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందేందుకు ఈ పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకొని, ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు.

భూ యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. నేటి నుండి ఈనెల 9వ వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, రైతాంగం ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
