Kadiyam Kavya | మహిళ, శిశు అభ్యున్నతిపై ఫోకస్ చేయండి
- మహిళల సాధికారత, బాలల సంక్షేమం, పోషణపై నిలదీత
- మహిళల రక్షణ సేవల అమలుపై కేంద్రం తీసుకున్న చర్యలపై గొంతెత్తిన ఎంపీ
- కేంద్ర పథకాల అమలుతోనే మహిళ, శిశు అభ్యున్నతి సాధ్యం
- పార్లమెంట్ లో ప్రశ్నించిన ఎంపీ కడియం.కావ్య
Kadiyam Kavya | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : మహిళల సాధికారత, బాలల సంక్షేమం, పోషణ, మహిళల రక్షణ సేవల అమలులో రాష్ట్ర పురోగతికి కీలకమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఈ అంశాలపై లోక్‌సభ(Lok Sabha)లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా అండ్ శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్(Savitri Thakur) సమాధానమిచ్చారు.
బేటీ బచావో బేటీ పడావో మహిళా శక్తి కేంద్రం, అంగన్వాడీ ౼ పోషణ 2.0, వన్ స్టాప్ సెంటర్లు, 181 హెల్ప్‌లైన్(181 Helpline) వంటి కార్యక్రమాల అమలును శాఖ నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం వల్ల బాలికల విద్య, రక్షణ, నైపుణ్యాభివృద్ధిలో గణనీయ పురోగతి(Significant progress) కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉందని వివరణ ఇచ్చారు. 2022లో నిలిపివేసిన మహిళా శక్తి పథకానికి బదులుగా మిషన్ శక్తి పథకం(Power scheme) అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మహిళల భద్రత, రక్షణ, సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లా మహిళా అభివృద్ధి కేంద్రం అవగాహన కార్యక్రమాలు, పథకాల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
అంగన్వాడీ–పోషణ 2.0 ద్వారా పిల్లల పోషణ, ప్రీ-స్కూల్ విద్య, మౌలిక సదుపాయాల పురోభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో 35,769 అంగన్వాడీ సెంటర్లు శిశువుల ఎదుగుదల పర్యవేక్షణ పరికరాల(Monitoring devices)తో సిద్ధంగా ఉండడం వల్ల పోషకాహార లోపాలను సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోందని చెప్పారు. మీల్స్, టేక్ హోమ్ రేషన్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వయోజన బాలికలకు జీవచక్ర విధానంలో పోషకాహారం(nutrition) అందుతున్నట్లు వివరించారు.
మహిళలపై హింస నివారణలో వన్ స్టాప్ సెంటర్ల పాత్ర ముఖ్యమని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వన్ స్టాప్ సెంటర్లు 2015 నుంచి 77,858 మహిళలకు వైద్య, చట్టపర, మానసిక సహాయం వంటి సేవలు అందించాయని చెప్పారు. 181 మహిళా హెల్ప్‌లైన్ ఈఆర్ఎస్ఎస్ –112తో అనుసంధానమై 76,444 కేసుల్లో స్పందించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… ఈ పథకాలు వరంగల్ సహా గ్రామీణ ప్రాంతాల్లో మరింత వేగంగా అమలు కావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం తగ్గడం, లింగ వివక్ష తగ్గించే దిశగా ఇవి మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆంకాంక్షను వ్యక్తం చేశారు.

