యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్

యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకోసం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగిందన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. శ్రీ ప్రభావ నామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిందన్నారు. జాబ్ క్యాలెండర్ లో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. నేడు మరోసారి డీఎస్సీని, జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను కేటాయించిందన్నారు. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పారు.
పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకూ ఈ క్యాలెండర్ లో స్పష్టమైన గడువులను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభ్యర్థులు ఎటువంటి గందరగోళం లేకుండా తమ ప్రిపరేషన్ ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే వీలు కలుగుతుందన్నారు. “జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదని, నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా” అనే సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించినట్లు తెలిపారు. పారదర్శకంగా, వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
