స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన..

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన..

ప్రముఖ పారిశ్రామికవేత్త గుర్రం రఘురాం చౌదరి పార్టీలో చేరిక
పూతలపట్టులో పటిష్టత దిశగా జనసేన

చిత్తూరు, ఆంధ్రప్రభ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం, సభ్యత్వ కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా జనసేన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుర్రం రఘురాం చౌదరి జనసేన పార్టీలో చేరడం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం జి.గొల్లపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సిద్ధార్థ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ అధినేత గుర్రం రఘురాం చౌదరి తన సహచరులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు రఘురాం చౌదరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాల గురించి వివరించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ పని చేయాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలంగా నిలబెట్టాలని సూచించారు. రఘురాం చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పార్టీ విధివిధానాలకు కట్టుబడి పని చేస్తామని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గం మరియు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో కలిసి ప్రజల మధ్య పని చేస్తూ పార్టీ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.

ఇటీవల జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్తూరు జిల్లాలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసిన విషయం తెలిసిందే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి జనసైనికుడు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవాలని, కోటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులు తప్పనిసరిగా పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎదగాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల కంటే ప్రజల చేత ఎన్నుకోబడిన పదవులకు గౌరవం, ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందుకే పార్టీ కార్యకర్తలు ముందుండి పోటీ చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయడంతో పాటు పలువురు నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రక్రియను జనసేన నాయకులు ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గంలో పలువురు నాయకులు జనసేనలో చేరడంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని నాయకులు భావిస్తున్నారు. గుర్రం రఘురాం చౌదరి వంటి ప్రముఖులు పార్టీలో చేరడం ద్వారా పూతలపట్టు నియోజకవర్గంలో జనసేనకు జవసత్వాలు పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మామిడి గుజ్జు పరిశ్రమ ద్వారా పూతలపట్టు నియోజకవర్గం మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న రఘురాం చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని స్థానిక ప్రజలు, రైతులు, నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రైతులతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన రాజకీయాల్లోకి రావడం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విస్తరించడం, కొత్త నాయకులను పార్టీలో చేర్చుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మరింత మంది నాయకులను పార్టీలో చేర్చుకుని జనసేనను ప్రజల్లో మరింత బలంగా నిలబెట్టేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తోంది.

Leave a Reply