శుభకార్యాలకు బ్రేక!

  • ఫిబ్రవరి 18 వరకు శుక్ర మూఢం
  • 86 రోజులపాటు ముహూర్తాలు లేనట్టే!
  • వివాహాలు, గహప్రవేశాల కోసం ఆగాల్సిందే…
  • ఉపాధి అవకాశాలకు దెబ్బ

ఉమ్మడిరంగారెడ్డి,ఆంధ్రప్రభబ్యూరో: ఏ కార్యక్రమం చేయాలన్నా మంచి ముహూర్తం ఉండాలి. ముహూర్తాలు లేకపోతే పెళ్లి, గృహ ప్రవేశాలకు బ్రేక్‌ పడుతుంది. ఈ సారి ఏకంగా మూడు మాసాలపాటు ముహూర్తాలు లేవు. శుక్రమూఢం నేపథ్యంలో 86 రోజుల పాటు ముహూర్తాలు లేవు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 18 వరకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చి చెబుతున్నారు.

వివాహాలు చేసు కోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి ముహూర్తాల కష్టాలు రానున్నాయి. పండితులు దాదాపు మూడు నెలల వరకు మంచి ముహూర్తాలే లేవంటున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి శుక్రమూఢం ప్రారం భమై 2026 ఫిబ్రవరి 18 వరకు కొనసాగనుంది.

ఆ తరువాతే మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమా వాస్య వరకు.. అంటే నవంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుందని చెబుతున్నారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు.

ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించరు. తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మాత్రం మూఢమి వర్తించదు. మాఘమాసంలో పెళ్లిల్లు జరిగేవి. కానీ ఈసారి మాత్రం బ్రేక్‌ తీసుకుంది.

ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్‌ అన్నీ ఫుల్‌ గా ఉండేవి. ఈసారి మాత్రం హడావిడి లేకుండా పోయింది. ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేక బుకింగ్స్‌ లేవని ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు వాపో తున్నారు.

మూడు నెలలు ఉపాధి లేనట్టేవివాహాల సీజన్‌లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు దండిగా ఉపాధి లభిస్తుంది. ఫంక్షన్‌ హాల్స్‌ మొదలుకుని అందులో పని చేసే కూలీల వరకు పనులు ఉంటాయి. కానీ శుక్రమూఢం నేపథ్యంలో ఉపాధికి బ్రేక్‌ పడనుంది. శుభ కార్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈసారి మాఘ మాసంలో బాజా భజంత్రీలు మోగే పరిస్థితులు లేవు. దాదాపుగా మూడు మాసాలపాటు ఇతర పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply