మూడు రోజులుగా తండ్రికి పున్నామ నరకం..

మూడు రోజులుగా తండ్రికి పున్నామ నరకం..

  • తండ్రి ఆస్తి కోసం పెద్దన్న కొట్లాట
  • పోలీసుల జోక్యంతో అతిమ సంస్కారం

యడ్లపాడు (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ) : కన్నతండ్రికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమారులు సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు.ఆస్తి పంపకాలు జరిగితే తప్ప అంతిమ సంస్కారాలు నిర్వహించమని మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, గ్రామపెద్దలు కథనం మేరకు… పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలసకు చెందిన గవ్వల పెద్ద ఆంజనేయులు (85) వయసులో ఉండగా కష్టపడి పొలం పనులు చేసి 6 ఎకరాల పొలం సంపాదించాడు.

ఆయనకు పెద్ద కుమారుడు. గువ్వల నాగేశ్వరరావు గతంలో కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని ఇల్లు వదలి తెలంగాణా ప్రాంతం వెళ్లాడు. కన్నతండ్రి స్వార్జితంలో కొంత భాగం గతంలోనే అతనికి ఇచ్చారు.ఇద్దరు కుమార్తెలు మల్లీశ్వరి, అనసూయమ్మ పెళ్లిళ్లు జరగటంతో మెట్టినింట నివసిస్తున్నారు. పెద్ద ఆంజనేయులు భార్య పదేళ్ల కిందటే చనిపోయింది. వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆంజనేయులు గత కొనేళ్లుగా తన చిన్న కుమారుడు శ్రీనివాసరావు వద్ద ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో పెద్ద ఆంజనేయులు ఆనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి మరణవార్త తెలుసుకున్న నాగేశ్వరరావు గ్రామానికి వచ్చాడు. ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో వాదనకు దిగాడు. ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలని. అప్పుటి వరకు తండ్రి అంత్యక్రియలు నిర్వహించటానికి ఒప్పుకోనని భీష్మించాడు. నాగేశ్వరరావుకు గతంలో ఆస్తి లో వాటా ఇచ్చామని, కుటుంబం అన్ని బాధ్యతలు తాను చూస్తున్నానని, ఆస్తిలో మళ్ళీ వాటా ఇచ్చేది లేదని చిన్నకుమారుడు శ్రీనివాసరావు చెప్పాడు.

గ్రామపెద్దలు జోక్యం చేసుకున్నా మూడు రోజులుగా వివాదానికి పరిష్కారం కాలేదు. సమస్య మంగళవారం పోలీసుల దృష్టికి రాగా గ్రామానికి వెళ్లారు. తండ్రి అంత్యక్రియలు పూర్తి తర్వాత సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించకపోతే మృతదేహాన్ని పంచాయతీకి అప్పగిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. దీంతో గ్రామపెద్దలు జోక్యంతో కుటుంబ సభ్యులు అదే రోజు చీకటి పడిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Reply