డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ

. డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం:
. ఈగల్ ఐజి రవికృష్ణ.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 70 లక్షల మంది విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.


రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు పలు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టినట్లు వివరించారు. ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ చైతన్యం, ఇంపాక్ట్ ఆపరేషన్ల ద్వారా గంజాయి సాగు, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసరాలను పొగాకు, డ్రగ్స్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.


రాష్ట్రవ్యాప్తంగా 849 హాట్ స్పాట్స్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. డ్రోన్ సర్వేలెన్స్, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు, విస్తృత అవగాహన కార్యక్రమాల ద్వారా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. గత 12 సంవత్సరాల డేటాతో నార్కోటిక్ నేరస్తులపై ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొనే నేరస్తులపై PIT చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 101 మందిని నిర్బంధించామని తెలిపారు.

మరో 200 మందిపై చర్యల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అవసరమైతే డ్రగ్స్ పెడ్లర్లపై NDPS చట్టం ప్రకారం ఆస్తుల జప్తు చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు.
ఎక్కడైనా గంజాయి సాగు, డ్రగ్స్ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా “డ్రగ్స్ మిమ్మల్ని మాత్రమే కాదు, మీ కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది”, “బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్”, “డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న విద్యార్థులు” వంటి సందేశాలతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. యువత తప్పు దారి పట్టకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు, డ్రగ్స్ ఎడీ హరి హర తేజ, కళాశాల ప్రిన్సిపల్ వీరభద్ర రెడ్డి, డీన్ దేవకి, తాలుకా సీఐ తేజమూర్తి, ఈగల్ టీం అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply