వరద ప్రాంతాల పరిశీలన

వరద ప్రాంతాల పరిశీలన
మక్తల్ , ఆంధ్రప్రభ : భీమా, కృష్ణా నదులకు వచ్చిన వరద నీటిలో పొలాలు మునిగపోయాయని, వరద నీరు తగ్గితే అధికారులు పంట నష్టం తేల్చుతారని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని తంగిడిగి, కుసుముర్తి ,సుకూర్ లింగంపల్లి, హిందూపూర్ తదితర గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు.
కృష్ణ భీమా నదుల సంఘం క్షేత్రం వద్ద వెలిసిన శ్రీ దత్త భీమేశ్వరాలయం చుట్టూ వరద నీరు చేరడంతో వరద నీటిలోనే నడుచుకుంటూ వెళ్లి దేవాలయంలో ఉంటున్న పూజారులను మంత్రి కలుసుకుని మాట్లాడి వచ్చారు. ఉదృతంగా ప్రవహిస్తున్న బీమా వరద ఉద్ధృతిని ఒడ్డు నుండి మంత్రి పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను మంత్రి పరిశీలించారు.
రైతులను ఆదుకుంటాం..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీమా, కృష్ణా నదుల వరద తాకిడికి పంటలు మునిగి దెబ్బతిన్న పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని అన్నారు. వాసునగర్ లో ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో గ్రామాన్ని ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాధ్యతలు అందరిని కేంద్రంలో ఉంచడం జరిగిందని మంత్రి తెలిపారు. వరద ప్రవాహం తగ్గగానే అధికారులను పంపించి పంట నష్టం అంచనా వేయిస్తామన్నారు.
వరదలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. మంత్రి తోపాటు జడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజప్ప గౌడ ,ఆనంద్ గౌడ్ ,రవీందర్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. సీఐ రామ్ లాల్ , ఎస్సై నవీద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
