ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (PJP) వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం ప్రస్తుతం 317.800 మీటర్లు (1,042.651 అడుగులు)గా నమోదై ఉంది. ఇది పూర్తిస్థాయి రిజర్వాయర్ మట్టమైన 318.516 మీటర్లకు అత్యంత సమీపంలో ఉంది. దీంతో ప్రాజెక్ట్ భద్రతకు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 9.657 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 8.222 టిఎంసీల నిల్వ ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 72,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీనిని నియంత్రించేందుకు అధికారులు 5 గేట్ల ద్వారా 20,070 క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా 36,415 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అదనంగా, 44 క్యూసెక్కులు ఆవిరైపోతున్నాయి.
నీటి వినియోగ పరంగా, కోయిలసాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 485 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. మొత్తంగా 57,329 క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతోంది.
ఈ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తూ, వరదనీటిని నియంత్రితంగా విడుదల చేస్తున్నారు. వర్షాలు కొనసాగితే మిగతా లిఫ్ట్ ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటి వినియోగం పెరగే అవకాశముంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, లోతట్టు ప్రాంతాలకున్న ప్రజలను అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.