Indrakeeladri | వైభవంగా ఆదిదంపతుల గిరి ప్రదక్షిణ..

Indrakeeladri | వైభవంగా ఆదిదంపతుల గిరి ప్రదక్షిణ..

Indrakeeladri, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిరపౌర్ణమి సందర్బంగా విజయవాడలోని (Vijayawada) శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత, మల్లేశ్వరుడు, వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం.. గురువారం పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమాన్ని ప్రారంభించారు.

సంప్రదాయ కోలాట నృత్యములు, భజన సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. విధ్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టి నగర్, కొత్త పేట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి, శ్రీ దుర్గామల్లేశ్వరుల రధం నడిచే దారిలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి, దేవ దేవేరిలకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు, ఆలయస్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు బి.శంకర శాండిల్య, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply