IND vs SA T20 | దక్షిణాఫ్రికాపై ఘన విజయం..

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా… భారత బౌలర్ల విజృంభణకు 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (2/13), హర్షిత్ రాణా (2/34) నిప్పులు చెరిగే బంతులతో ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (0), క్వింటన్ డికాక్ (1), డేవాల్డ్ బ్రెవిస్ (2)లను త్వరగా పెవిలియన్‌కు పంపి సఫారీలను 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్లైన వరుణ్ చక్రవర్తి (2/11), కుల్దీప్ యాదవ్ (2/12) బంతులతో మ్యాజిక్ చేసి మిగిలిన వికెట్లను చుట్టేశారు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, జట్టును పతనం నుంచి కాపాడలేకపోయాడు.

అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శివమ్ దూబే (10 నాటౌట్)తో క‌లిసి… హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (26 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Leave a Reply