IND vs ENG | నిల‌దొక్కుకున్న బ్రుక్… భారీ స్కోర్ దిశ‌గా ఇంగ్లాండ్ !

హెడింగ్లీలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట అత్యంత ఉత్కంఠగా మారింది. భారత్ బౌలర్లపై దాడికి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు… దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్‌ వైపు దూసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ బలంగా ఆడి మంచి స్కోర్ అందించ‌గా… మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు కూడా అదే రీతిలో సహకరిస్తున్నారు.

ప్రత్యేకించి బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్ వంటి ఆటగాళ్లు మంచి ఆరంభాన్ని అందించగా.. ప్ర‌స్తుతం మిడిలార్డ‌ర్ లో హ్యారీ బ్రుక్ త‌మ ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపిస్తున్నాడు. మూడో రోజు ఆరంభం భారత బౌలర్లకు అనుకూలంగా ఉండగా, ప్రసీద్ కృష్ణ వేసిన అద్భుతమైన బంతికి శతకపు వీరుడు ఒల్లీ పోప్ (106) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

తొలి సక్సెస్‌ను అందుకున్న భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ భారత బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ మెరిసే షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్ లాంటి ప్రధాన బౌలర్లను సైతం ధీటుగా ఎదుర్కొంటూ తన ఆటతీరు ద్వారా ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు.

కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి 5వ వికెట్ కు బ్రూక్ 51 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అయితే, ఈ జోడిని మోహమ్మద్ సిరాజ్ విడదీశాడు. స్టోక్స్‌ను అవుట్ చేసి భారత్‌కు రెండో బ్రేక్‌థ్రూ అందించాడు. ఇది మ్యాచ్‌లో మళ్లీ భారత్ పైచేయి సాధిస్తుందని అనిపించినా, బ్రూక్ క్రీజులో కుదురుకున్నాడు.

వికెట్ కీపర్ జేమీ స్మిత్ తో కలిసి బ్రూక్ మళ్లీ ఇంగ్లండ్ స్కోరును చక్కదిద్దడం ప్రారంభించాడు. దీంతో లంచ్ సమయానికి ఈ ద్వయం 51 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ 57, జేమీ స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 327/5గా ఉంది, ఇంకా భారత్ స్కోరుతో పోలిస్తే 144 పరుగులు వెనకబడి ఉంది (భారత్ 471 ఆలౌట్).

మూడో రోజు మధ్యాహ్న సెషన్ మ్యాచ్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply