కర్ర గుర్రాలపై యువకుల సందడి


ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి, 2 జూలై ( ఆంధ్రప్రభ) : గిరిజ‌నులు (Tribal people) నాగ‌రిక‌త‌కు దూరంగా నివ‌సిస్తూ ప్ర‌త్యేక సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను క‌లిగిఉంటారు. మ‌న దేశంలో గిరిజనులు అనేక ప్రాంతాలలో నివసిస్తుంటారు. వీరు అనాదిగా కొండ‌లు, అట‌వీ ప్రాంతాల్లో (forest areas) జీవ‌నం సాగిస్తున్నా గిరిజ‌నులు త‌మ సంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత కంప్యూట‌ర్ యుగంలో మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను మ‌రిచిపోతున్నాం. ఆధునిక‌ పోక‌డ‌ల‌తో క‌ట్టు బొట్టు మారి పోయింది. బారుల్లో, ప‌బ్బుల్లో గ‌బ్బు లేపుతున్నాం. కానీ ఏజెన్సీలో నివ‌సించే గిరిజనులు మాత్రం వారి పురాతన సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఆదివాసి గూడెంలలో ఇప్ప‌టికీ వారి పెద్ద‌లు నిర్వ‌హించిన పండ‌గ‌లు, దేవ‌త‌ల‌కు చేసే పూజ‌ల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తుంటారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇంద్రవెల్లిలోని ఏజెన్సీ ప్రాంతంలో నేటికి ఆదివాసీల కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అద్దంపట్టేలా ఉంటాయి. వారి పండుగలు కూడా నెలకొక్క సంప్రదాయం (Tradition) తో ఏదో ఒక పండుగ సంవత్సరం పొడుగునా చేస్తుంటారు. అయితే ప్ర‌తీ ఏడాది శ్రావణ మాసంలో అమావాస్య రోజున అడవికి వెళ్లి వారి సంప్రదాయాల ప్రకారం పూజలు చేసి వెదురు కర్రలతో గుర్రాలను తయారు చేసి తీసుకువస్తారు. ఇలా నెల రోజుల పాటు ఆదివాసి పిల్లలు ఈ కర్ర గుర్రాలపై ఊరేగుతూ గ్రామంలో తిరుగుతారు. శ్రావణ మాసం (sravana masam)లో తయారు చేసిన కర్ర గుర్రాల పై నడిస్తే అంటూ రోగాలు తొలగిపోయి పాడి పంటలు సమృద్ధిగా పండి ఊరికి మేలు జరుగుతుందన్న గిరిజ‌నుల న‌మ్మ‌కం. ఇది వీరి పూరికుల నుంచి వస్తున్న సంప్రదాయన్ని నేటికీ పాటిస్తున్నారు. అయితే కర్ర గుర్రాలపై నడిచే సంప్రదాయన్ని నెల రోజుల పాటు కొనసాగించి పోలాల అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున జగేయ్ మతరీ జగేయ్.. అంటూ గ్రామస్థులంతా కలసి ఊరి పులిమేర చివరిలో శివ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి వదలి వస్తారు.

Leave a Reply