Kesamudram | అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన

Kesamudram | అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన
అల్పాహారం పెట్టటం లేదని ఆరోపణలు
Kesamudram | కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్లో తినే అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ధర్నాకు దిగిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.
విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజులుగా కల్వలలోని మోడల్ స్కూల్లో (Kalvala Model School) పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వవలసి ఉండగా నిర్వాహకులు సమయానికి ఇవ్వకపోవడంతో పస్తులతోనే చదువులకు వెళుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సైతం ఉదయం ఇవ్వాల్సిన టిఫిన్ విద్యార్థులకు (students) ఇవ్వకపోవడం మూలంగా పస్తులతో వెళ్లారు.
ఈవిషయంపై స్థానిక తహసీల్దార్ (Tahsildar), ప్రిన్సిపాల్ కూడా బుధవారం విచారణ చేసి నిర్వాహకులను మళ్లీ ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అయినప్పటికీ గురువారం సైతం విద్యార్థులకు అల్పాహారం ఇవ్వకపోగా తినడానికి పెట్టిన భోజనంలో పురుగులు వచ్చాయని పేర్కొంటూ ధర్నాకు దిగారు. తమకు ఈ నిర్వాహకులు వద్దు, మార్చాలని జిల్లా కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేది లేదంటూ విద్యార్థులు పేర్కొన్నారు.

