మేయర్ దంపతుల హత్య కేసులో ఇన్ సైట్ స్టోరీ

మేయర్ దంపతుల హత్య కేసులో ఇన్ సైట్ స్టోరీ

( చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : చింటూ..అతడు మంచి బాలుడు. జన్మస్థలం చిత్తూరు గంగనపల్లి . బాగా చదివాడు. ఓడల ఇంజనీరయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మామూలు హోదా కాదు. లక్షల్లో జీతం. కానీ.. అనుబంధం, ఆత్మీయతకు కంకణ బద్ధుడు. తన తల్లి తమ్ముడు కటారి మోహన్ అంటే… చిన్ననాటి నుంచి అమితమైన ప్రేమ. మోహన్ కంట తడిపెడితే.. చింటూ కళ్లల్లో సుడులు తిరుగుతాయి. అలాంటి మేనమామపై రాజకీయ వేధింపులు తట్టుకోగలడా? పైగా తప్పుడు కేసులు పెడితే సహించగలడా? అందుకే ఓడలొద్దు. మిద్దెలొద్దు. మేనమామ కళ్లల్లో ఆనందం చాలు అంటూ.. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మేనమామకు కుడి భుజంగా మారాడు. శత్రువు సీకే బాబును చంపేయటమే లక్ష్యంగా తిరిగాడు. హత్యకు యత్నించాడు. రెండు కేసుల్లో దొరికిపోయాడు. కోర్టు తీర్పులు వచ్చే లోపునే.. మేనమామపై ప్రేమ కరిగిపోయింది. పగ ద్వేషం పెరిగింది. మేనమామ, మేనత్తను స్వయంగా చంపేశాడు. ఇక చట్టం తన పని తాను చేసుకు పోయింది. రెండు హత్య కేసుల్లో ఆధారాలు లేక.. చింటూను నిర్ధోషిగా కోర్టు నిర్ధారిస్తే.. మేనమామ , మేనత్త హత్య కేసులో దోషిగా నిర్ధారించి.. ఉరి శిక్ష విధించింది. అమిత ప్రేమ, పగ.. ఏ దారి తీస్తాయో.. ఈ కేసు నిరూపించింది. ఆంధ్రప్రభ ఇన్ సైట్ స్టోరీ ఇది.

చిత్తూరు మేయర్ కటారి అనురాధ, కటారి మోహన్ ల హత్య కేసులో చిత్తూరు జిల్లా 9వ కోర్టు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నిందితులు శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వేంకట చలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్, జయ ప్రకాష్ రెడ్డి అలియాస్ రెడ్డి, తోటి మంజునాథ్ , వెంకటేష్ ను దోషులుగా నిర్ధారించారు. ఉరి శిక్షను ఖరారు చేశారు. చిత్తూరు జిల్లాలోని ఈ కోర్టులో ఇదే తొలి ఉరి శిక్ష కావటంతో.. తీవ్ర సంచలనం రేపింది. కాంగ్రెస్ నాయకుడు సీకే బాబుపై హత్యాయత్నం కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు చంద్ర శేఖర్ కు ఉరి శిక్ష పడటంతో.. చిత్తూరులో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు హత్య కేసుల్లో నిర్దోషిగా బయటపడిన చంద్రశేఖర్… ఉరి శిక్ష ఖాయం కావటంతో.. ఈ నేరస్థుడి చరిత్రను జనం గుర్తు చేసుకొంటున్నారు. గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్ ఒక మెరైన్ (ఓడల) ఇంజనీర్. ఆయన స్వయానా మృతుడు కటారి మోహన్ మేనత్త కొడుకు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే సీకే బాబు కారణంగా కటారి మోహన్ కు అన్యాయం జరిగిందని, ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్ర శేఖర్ (చింటూ) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బంగారం లాంటి ఉద్యోగం లక్షల్లో జీతం.. హోదాను తృణప్రాయంగా త్యజించడు. తన మేనమామ కటారి మోహన్ కళ్ళలో ఆనందాన్ని చూడడానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబను చంపటమే ప్రధాన లక్ష్యం పెట్టుకునాడు.

పలమనేరు రోడ్డులోని చిత్తూరు క్లబ్ వద్ద బీహార్ కి చెందిన వ్యక్తులు సీకే బాబు మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులు సికే బాబు తృటిలో తప్పించుకున్నారు. ఆ కాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్, మున్సిపల్ ఉద్యోగి మరణించాడు. ఆ ప్రయోగం విఫలం కావడంతో మరోమారు కట్టమంచి సాయిబాబా గుడి నుంచి సీకే బాబు ఇంటికి వెళ్లే దారిలో కల్వర్టు కింద బాంబు పెట్టాడు. బాంబు పేలిన ఘటనలో కూడా సీకే బాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రెండు కేసులు కటారి మోహన్, చింటూ మీద నమోదయ్యాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కటారి మోహన్, చింటూ చాలాకాలం అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో తాలూకా స్టేషన్ సిఐగా ఉన్న రవి మనోహర్ ఆచారి చాకచక్యంగా వీరిని అరెస్టు చేశారు. అనంతరం బెయిలు మీద బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కటారి మోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అయ్యారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్థానిక ఎన్నికలలో చిత్తూరు మున్సిపాలిటీ బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా చింటూ వ్యవహరించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేశారు. ఫలితంగా చిత్తూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ మేయర్ పదవి కటారి మోహన్ సతీమణి కటారి అనురాధా మున్సిపల్ మేయర్ అయ్యారు. అప్పటి వరకు కటారి మోహన్ కు చింటూకు అనుబంధం చెక్కు చెదరలేదు. మున్సిపాలిటీ కాంట్రాక్టులు, కూరగాయల మార్కెట్ టెండర్లు, క్వారీలు అప్పగింత.. తదితర ఆర్థిక విషయాలలో ఇద్దరి మధ్య మంటలు రాజుకున్నాయి. మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంట్రాక్టర్ ప్రసన్న వర్గానికి, చింటూ వర్గానికి గొడవలు జరిగాయి. ఈ గొడవలలో కటారి మోహన్ ప్రసన్న వర్గానికి మద్దతు ఇచ్చారు. ఇక విభేదాలు తారాస్థాయికి చేరాయి.

ఇన్ని చేసిన, తన మాటకు విలువ ఇవ్వకపోవడంతో.. తన మేనమామ మారిపోయాడని, మేనత్తకు దాసోహమయ్యాడని, ఆమె మాటే వింటున్నాడని చంద్రశేఖర్ కోపం రగిలింది. మేయర్ కటారి అనురాధ మీద ద్వేషం పెరిగింది. తన కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ మొగడు పెళ్లాం తనను తక్కువగా చూస్తున్నారని.. సహించలేకపోయాడు. దంపతుల హత్యకు పధక రచన చేశాడు. అనుకున్న ప్రకారం 2015 నవంబర్ 17వ తేదీన తన పథకాన్ని అమలుపరిచాడు. ఆరోజు సోమవారం కావడంతో మేయర్ కటారి అనురాధ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆమె భర్త కటారి మోహన్ కూడా పక్కనే ఉన్నారు. చింటూ తో పాటు మరో నలుగురు బురఖాల ధరించి మారణాయుధాలతో మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు గ్రీవెన్స్ డే కావడంతో మున్సిపల్ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు. మేయర్ ఛాంబర్ లోకి వెళ్లి ఒక ఉదుటన మేయర్ దంపతుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అక్కడికక్కడే మేయర్ అనురాధ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కటారి మోహన్ ను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా తుది శ్వాస విడిచారు. ఒకేరోజు, ఒకే దగ్గర దంపతులకు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం మేయర్ దంపతుల మధ్య కేసులు తీర్పు వెలువడింది. తీర్పు వెలువడిన వెంటనే చింటును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో 18 మందిని కోర్టు నిర్దోషిలుగా ప్రకటించింది.

ఐపీసీ 120 బీ ప్రకారం కుట్ర నేరంలో ఐదుగురు నిందితులు దోషులుగా తేలారు. ఐపీసీ 302 r/w 120-B (కటారి అనురాధ , కటారి హత్య) కేసులో ఐదుగురు నిందితులకు మరణదండన (Death Sentence) విధించారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ కు రూ. 70 వేల రూపాయలు – జరిమానా విధించారు. హతులు కటారి అనురాధ, కఠారి మోహన్ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలి, ప్రధాన సాక్షి వెలూరి సతీష్ కుమార్ నాయుడుకురూ.20 లక్షలు పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లించకపోతే ఆరు నెలల సాదా జైలుశిక్ష అనుభవిచాలి. ఇక మిగిలిన దోషులు ఒక్కక్కరికీ వెయ్యిరూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించక పోతే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలి. ఇది సరే.. సాక్ష్యాధారాలు లేకపోవటంతో.. రెండు హత్యాయత్నం కేసుల్లో నిర్దోషులుగా బయట పడిన చింటూకు .. తాజాగా మరణదండన శిక్ష ఖరారు కాగా.. ఉన్నత కోర్టుల్లో.. చింటూ అసలు భవిష్యత్తు ఖరారు చేయకతప్పదు. మరో సారి చింటూ న్యాయపోరాటానికి సిద్ధపడుతాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ తీర్పుపై దివంగత మేయర్ అనురాధా మేనకోడలు చుడా చైర్మన్ కటారి హేమలత హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

Leave a Reply