కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు..

కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కేరళ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎర్నాకులం జిల్లా బహిరంగ సభలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. “కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు బయటకు ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నా, ప్రజలను మోసం చేయడంలో మాత్రం కలిసి పోయారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారానికి కొత్త మలుపు తీసుకువచ్చాయి.
ఎన్నికల ప్రచారం కోసం కేరళ పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్, ఎర్నాకులంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొని, కేంద్ర మంత్రితో వేదిక పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. సభ ప్రాంగణంలో కనిపించిన ప్రజల ఉత్సాహం, స్పందన చూస్తే కేరళలో జాతీయవాద రాజకీయాలకు ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్, కేరళలో అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఆరోపించారు. అవినీతి, కుటుంబ పాలన, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం కారణంగా ఈ రెండు ప్రధాన కూటములు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాయని విమర్శించారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్న అవినీతి ఆరోపణలు, సీబీఐ విచారణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి అజెండా కంటే రాజకీయ ఆరోపణలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్పష్టమైన ప్రత్యామ్నాయంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ–ఎన్డీఏ వైపు ఆశగా చూస్తున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి, పారదర్శకత, సుశాసనం కోసం ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళలో ఎన్నో దశాబ్దాలుగా మారుమూల రాజకీయ కూటముల మధ్యే పోటీ కొనసాగుతోందని, కానీ ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్–కమ్యూనిస్టుల పరస్పర విమర్శలు కేవలం ఎన్నికల నాటకమేనని, అసలు విషయానికి వస్తే రెండూ ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పని చేస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల పోలింగ్‌కు ముందు రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో మరింత వేడి పుట్టించాయి. బీజేపీ ఈ విమర్శలను ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుంటుండగా, కాంగ్రెస్–ఎల్డీఎఫ్ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే పోలింగ్‌కు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
