ADB | కారు, లారీ ఢీ.. వెలుగులోకి అక్రమ బియ్యం సరఫరా
నిర్మల్ ప్రతినిధి, భైంసా, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) : బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీ భైంసా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఓ కారును ఢీకొట్టి పోలీసులకు పట్టుబడింది. బియ్యం లోడ్ తో భైంసా మీదుగా వెళ్తున్న లారీ పట్టణ కేంద్రంలోని శివాజీ చౌక్ లో యూటర్న్ తీసుకుంటున్న ఓ కారుని యాక్సిడెంట్ చేయగా.. కారు డ్రైవర్ కు నుదుటిపై గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలపాలైన కారు డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు లారీని పట్టుకొని సీజ్ చేయగా, లారీలో ఉన్న లోడ్ ను పరిశీలించగా పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. వెంటనే సంబంధిత డీటీ, సివిల్ సప్లై అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి జిల్లా సివిల్ సప్లై అధికారి కిరణ్ కుమార్ చేరుకొని పట్టుపడ్డ బియ్యాన్ని పరిశీలించారు. దాదాపు 30టన్నుల పైనే పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయన్న విషయాలు పూర్తి దర్యాప్తులో తేలుతుందని ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు.