Kovvur | దగ్గరికొస్తే గోదావరిలో దూకేస్తా.. కొవ్వూరులో మహిళ హైడ్రామా..

తూర్పు గోదావరి​, ఆంధ్రప్రభ : తూర్పు గోదావరి (East Godavari) జిల్లా కొవ్వూరులో ఓ మహిళ దాదాపు ఏడు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించింది. దేవరపల్లి (Devarapalli) మండలం దుద్దుకూరుకు చెందిన చిలకపల్లి నాగమణి సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొవ్వూరు (Kovvur) రోడ్ కం రైలు వంతెన ట్రాక్‌పైకి చేరుకుని గడ్డర్‌పై ప్రమాదకరంగా కూర్చుంది. గమనించిన రైల్వే సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు.

గోదావరిలో దూకిన మహిళ..
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను గడ్డర్‌పై నుంచి కిందికి రప్పించే ప్రయత్నం చేశారు. అయితే, తన దగ్గరకు ఎవరైనా వస్తే దూకేస్తానని ఆమె బెదిరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత తన పేరు నాగమణి (Nagamani) అని, దుద్దుకూరు హైస్కూలు వీధిలో ఉంటానని వివరాలు చెప్పింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి స్థానికులను తీసుకొచ్చారు. అలాగే కాకినాడ నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక జాలర్లను కూడా పిలిపించారు. గడ్డర్​పై చాలాసేపు అలానే కూర్చున్న నాగమణి నిన్న ఉదయం 7.45 గంటలకు గోదావరిలోకి దూకేసింది. వెంటనే అప్రమత్తమైన ఈతగాళ్లు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు.

మానసిక ఒత్తడికి గురై..
నాగమణి పెద్ద కుమార్తె తండ్రితో ఉంటుండగా, చిన్న కుమార్తెతో కలిసి నాగమణి తల్లి వద్దే ఉంటోంది. కుమార్తె నాలుగు నెలల క్రితం అదృశ్యం కావడంతో నాగమణి ఒంటరైంది. దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply