అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం..

అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం..
ఉర్కొండ: ఆంధ్రప్రభ : ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ యువతకు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. క్రికెట్‌ను ఆస్వాదించడం మంచిదే కానీ బెట్టింగ్ అనే ప్రమాదకర మార్గంలో పడితే అది జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని ఎస్సై కృష్ణ దేవ అన్నారు. ఐపీఎల్ సీజన్ మొదలైన తరుణంలో మండలంలోని క్రికెట్ అభిమానులకు, యువకులకు, క్రికెట్ విక్షకులకు కీలక సూచనలు చేస్తూ హెచ్చరించారు. క్రికెట్ ను క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐపీఎల్ సీజన్లో జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. ఐపీఎల్ సందర్భంగా కోట్ల రూపాయల బెట్టింగ్ దందా సాగుతుంది. అనేక మంది యువత బెట్టింగ్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.
డబ్బు కోసం ప్రమాదకరమైన బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా 8712657754 వాట్సాప్ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆన్లైన్ లో మాత్రమే కాకుండా రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బేట్టింగ్స్, మండలంలో బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బెట్టింగ్ కు పాల్పడినట్టు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
