HYDRAA | సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ ఆక్రమణలు కూల్చివేత

HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు.

ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు.

ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో నిర్వహించారు . సంబంధిత లేఅవుట్‌కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్లు, పార్కులు వంటి ఉమ్మడి భూములపై ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన గదులు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటి కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు.

ఈ సందర్భంగా పలువురు ప్లాట్ యజమానులు తమ స్థలాలు కనబడకుండా అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన వంటగదులు, రెస్ట్‌రూములు, మినీ హాల్ వంటి నిర్మాణాలన్నీ హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేశారు.

అంతేకాకుండా, జీ+2 అంతస్థుల్లో నిర్మించిన మూడు ఐరన్ షెడ్లు కూడా తొలగించారు.. అదనంగా లేఅవుట్‌ను ఆక్రమించి వేసిన రేకుల ఫెన్సింగ్‌ను కూడా అధికారులు తొలగించారు. నగర శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో ఇటువంటి అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శాసనానుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *