హైదరావాద్ :ఒక భవనం నిర్మాణంలో ఇన్ని ఉల్లంఘనలా..? ఆసుపత్రి అంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. ఎక్కడికక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ v ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని డాక్టర్ శంకర్స్ ఆసుపత్రి నిర్మాణంలో నిబంధనల ఉల్లఘనలు జరిగాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. .
రహదారులను ఆక్రమించి.. 4 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని… సెల్లార్‌తో పాటు.. 6 అంతస్తులను ఎలా నిర్మిస్తారని ఆసుపత్రి భవన యజమాని డా. శంకర్‌ని హైడ్రా కమిషనర్ ప్రశ్నించారు. అనుమతులన్నిటినీ పరిశీలించి.. చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించారు.
ఒకవైపు 10 అడుగుల దారి.. మరోవైపు 15 అడుగుల దారి ఉన్నచోట ఇన్ని అంతస్తులు ఎలా నిర్మిస్తారని.. అందుకు అనుమతులు చూపించాలని భవన యజమానిని కోరారు. నివాస ప్రాంతాల మధ్య ఇరుకు రహదారుల్లో దీనిని నిర్మించారని.. భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని సంబంధిత అధికారులను అడిగారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆస్పత్రికి ఎలా లైసెన్స్ మంజూరు చేశారని అధికారులను నిలదీశారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్ ఎంసీ సికింద్రాబాద్ జోనల్ చీఫ్ ప్లానర్ శ్రీనివాస్‌ను కోరారు. హైడ్రా ఫైర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ పాపయ్యగారు, డీఎఫ్‌వో యజ్ఞ నారాయణతో పాటు పలువురు హైడ్రా అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.