మ‌హిళ‌ల జోలికి వ‌స్తే.. మామూలుగా ఉండ‌దు!

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని, అలాంటి న‌గ‌రానికి అసాంఘిక శ‌క్తులు చుట్టుముడుతున్నాయ‌ని, వాటిపై ఉక్కు పాదం మోపుతాన‌ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. అలాగే మ‌హిళ‌ల జోలికి వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ డ్ర‌గ్స్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంద‌ని, డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామ‌న్నారు.

నగరంలో సైబర్ నేరాలు అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామ‌న్నారు. సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత లేక అనేక మంది నష్టపోతున్నార‌ని, వీటిపై నగర ప్రజలంతా అవగాహన పెంచుకోవాల‌న్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్‌ జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.

హైదరాబాద్ లో నేరాల కట్టడికి అనేక చర్యలు చేప‌డుతున్నామ‌ని, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత బాగా చెడిపోతోంద‌ని సీపీ అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నకు ప్రమోషన్ చేయవద్దని వీఐపీలను ఆయ‌న కోరారు. డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దన్నారు.

అరుదైన వ్యాధులకు ఔషధాలు అంటూ చేసే మోసాలూ పెరుగుతున్నాయ‌న్నారు. ఆన్లైన్ మోసాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. కల్తీ ఆహారంపై ప్రతేక దృష్టి పెడతామ‌ని చెప్పారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆ వ్యవస్థ ఏర్పాటు చేసి కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.

నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింద‌ని, ఏటా లక్షల్లో కొత్త వాహనాలు వస్తున్నాయ‌ని, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తామ‌ని స‌జ్జ‌నార్ అన్నారు. ట్రాఫిక్ వల్ల సమయం వృథా మాత్రమే కాదు.. ఆరోగ్యమూ పాడవుతుంద‌ని, మద్యం తాగి రోడ్లపైకి వాహనాలతో వస్తే వదిలేది లేద‌న్నారు.

వాళ్లను రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తామ‌ని చెప్పారు. ఇక చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. మహిళల జోలికి వస్తే సీరియస్‌ గా తీసుకుంటామ‌ని సజ్జనార్ హెచ్చరించారు.

Leave a Reply