భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త

భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
- భూపాలపల్లి మండలంలో కలకలం
భూపాలపల్లి రూరల్ / వెంకటాపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య, అతని భార్య సంధ్య దాంపత్య జీవితం ప్రారంభంలో సాఫీగా సాగింది. అయితే కొంతకాలం తరువాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్య తనకు మందు పెడుతుందనే అనుమానం సమ్మయ్యలో పెరుగుతూ రావడంతో తరచూ గొడవలు జరిగేవని గ్రామస్థులు తెలిపారు. ఈ వివాదాల కారణంగా సంధ్య కొంతకాలంగా భర్తకు దూరంగా ఉండి పుట్టింట్లో నివసిస్తోంది.
కాగా.. ఇటీవల సమీప బంధువు మరణించడంతో మూడు నెలల తర్వాత సమ్మయ్య భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరి మధ్య తగాదా చోటుచేసుకోగా ఆగ్రహానికి గురైన సమ్మయ్య గొడ్డలితో భార్యపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సంధ్య అక్కడికక్కడే మృతి చెందిందినట్లు తెలిపారు.
హత్య అనంతరం సమ్మయ్య నేరుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమ్మయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
