రెండో భార్యను చంపిన భర్త

చేవెళ్ల, ఆంధ్రప్రభ : రెండో భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధం గ్రామమైన వెంకన్నగూడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకన్నగూడ‌ గ్రామానికి చెందిన వాన రాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య రజిత(30)తో గత రెండేళ్లుగా మనస్పర్ధలున్నాయి. సోమవారం ఉదయం మాట్లాడుకుందామని ఆమెను నగరం నుంచి వెంకన్నగూడ గ్రామానికి తీసుకువచ్చాడు. గ్రామ పెద్దల సమక్షంలో సయోధ్య కొరకు ప్రయత్నించగా విఫలమైంది.

సాయంత్రం ఇద్దరు దంపతులు కలిసి గ్రామ సమీపంలో మద్యం సేవించారు. తదనంతరం రజితను చున్నీతో మెడకు బిగించి ఉరివేశాడు. చావలేదనుకుని సిమెంట్ కడ్డీతో మోది అతికిరాతకంగా హత్య చేశాడు. తర్వాత ఫొటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు షేర్ చేశాడు. రెండవ భార్య రజితను తానే హత్య చేశానని చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలేంటి ఇందులో మొదటి భార్యది ఏమైనా ప్రమేయం ఉందా..? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం జంగయ్య చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నాడు.

Leave a Reply