లారీ, బస్సు ఢీ.. ఒకరు మృతి – 20 మందికి గాయాలు
(అవుకు రూరల్, ఆంధ్రప్రభ) : చిన్నటేకూరు (chinnatekur) ప్రమాద ఘటన మరవక ముందే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. అవుకు రిజర్వాయర్ మలుపు సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే, బనగానపల్లె (Banganapalle) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బనగానపల్లె నుండి తాడిపత్రి వైపు వెళ్తుండగా, రిజర్వాయర్ సమీపంలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, లోపల కూర్చున్న ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

ఈ ప్రమాదంలో అవుకు మండలం (avuku mandalam) లోని శివవరం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి (50) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది.అదే బస్సులో ప్రయాణిస్తున్న ఆకుమల్ల వినీత్, సుబ్బరాయుడు రమణమ్మ, నాగేంద్ర, లక్ష్మీదేవి, కృష్ణవేణి తదితరులు గాయాలపాలయ్యారు.

స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లారీ అధిక వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అవుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


