ముస్కీ చెరువు అభివృద్ధిలో…

ముస్కీ చెరువు అభివృద్ధిలో…

మణికొండ: ముస్కీ చెరువు అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం చెరువు పరిసర నివాసులు, దేవాలయ కమిటీ సభ్యులు, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తత్త్వా సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ… వచ్చే వారం లోపల ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేసి, అనధికార ఆక్రమణలను తొలగించే చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. తత్త్వా సంస్థ చెరువు అందాల పనులు, బండ్ బలోపేత పనులను తక్షణమే ప్రారంభించనుందని వెల్లడించారు.

రైతులు, దేవాలయ కమిటీ భూములపై స్పష్టమైన సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించనున్నామని, భూదందాలు ఏవీ సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. FTL పరిధిలోని భూములను ప్రభుత్వం పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని, మొత్తం 60 ఎకరాల చెరువును పునరుద్ధరించనుంది.ఈ చర్యలతో వర్షపు నీటి నిల్వలు పెరగడం, భూగర్భ జలాల స్థాయిలు మెరుగుపడడం, గాలి నాణ్యత పెరగడం వంటి పలు పర్యావరణ ప్రయోజనాలు కలుగనున్నాయని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో హాల్‌మార్క్ వికినియా, మై హోమ్ అవతార్ కాలనీల నివాసులు గౌతమ్, లింగరాజు, రవీంద్ర చారి, రైతులు బట్ట సత్యనారాయణ, బట్ట రాజు, ఇరిగేషన్ అధికారి రామాదేవి (DE), నరేంద్ర (AE), తత్త్వా సంస్థ ప్రతినిధి రాకేష్ పాల్గొన్నారు. అందరూ హైడ్రా శాఖ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply