- సాంకేతికతలో ఆస్ట్రేలియాతో ముందడుగు
- ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో సింగరేణి
బొగ్గు మైనింగ్ లో అధికోత్పత్తి, యంత్రాలు, ఆధునిక రక్షణ సాంకేతికతలో ఆస్ట్రేలియా కంపెనీలతో ముందడుగు వేస్తామని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం సాయంత్రం 13 ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థ రానున్న కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని, కనుక భారీ ఖనిజ ఉత్పత్తి యంత్రాలను, అత్యాధునిక రక్షణ, భద్రత వ్యవస్థలను సింగరేణి సమకూర్చుకునే ఉద్దేశంతో ఉందన్నారు.
అలాగే సోలార్ విద్యుత్తు ఉత్పాదనను కంపెనీ భారీగా పెంచే ఆలోచన చేస్తుందని, విద్యుత్తును నిల్వ ఉంచుకునే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలకు కూడా తమ వద్ద అవకాశం ఉంటుంది అన్నారు. ఇంకా సింగరేణి సంస్థ చేపట్టనున్న పలు వ్యాపార విస్తరణ చర్యలను కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ వ్యాపార విస్తరణ చర్యలకు అవసరమైన యంత్రాలు, వ్యవస్థల ఏర్పాటుకు ఆస్ట్రేలియన్ కంపెనీలు సహకరించవచ్చని సూచించారు. ఆస్ట్రేలియా కంపెనీల ఉత్పత్తులను పరిశీలించి మేలైన, లాభదాయకమైన వాటికి అవకాశం ఇవ్వటం జరుగుతుందన్నారు.
లాంగ్ వాల్ టెక్నాలజీ, ఇతర సాంకేతికతల్లో, ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ బొగ్గు తవ్వకాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అవకాశం ఉన్న యంత్ర పరిజ్ఞానం అవసరమై ఉందన్నారు అలాగే మెరుగైన డంపుల భద్రత, సమాచార వ్యవస్థలకు కూడా తమ వద్ద అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ విదేశాల్లో ఖనిజాల ఉత్పత్తికి సిద్ధంగా ఉందని, ముఖ్యంగా కీలక ఖనిజాలను ఉత్పత్తి చేయడానికి లాభసాటి భాగస్వామ్యాన్ని సింగరేణి కోరుకుంటుందని తెలియజేశారు.
ఆస్ట్రేలియా దేశం నుంచి విచ్చేసిన 13 కంపెనీల ప్రతినిధులు తమ తమ ఉత్పత్తులను సాంకేతికతలను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సింగరేణి సంస్థ తరఫున సీఎండీ ఎన్.బలరామ్ తో పాటు డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్, జీఎం కో-ఆర్డినేషన్ ఎస్డిఎం సుభాని, జీఎం (సిపిపి) మనోహర్, ఒరిసెంట్, విల్సన్ మైనింగ్ సర్వీసెస్, మైన్సైట్, డీటీఎన్ ఏసియా పసిఫిక్, ఆర్ ఎం ఈ గ్లోబల్, మినరల్ టెక్నాలజీస్, తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.