ఆలయ అధికారులు ఘనస్వాగతం..
నంద్యాల బ్యూరో, మే 20 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం లోని దేవతలను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా.వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల దర్శనార్ధమై ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు అర్చక వేదపండితులు ఆలయ సంప్రదాయంలో భాగంగా ఘనంగా స్వాగతం పలికారు.
న్యాయమూర్తి దంపతులు మల్లికార్జునస్వామికి విశేష మైన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం, శ్రీభ్రమరాంబదేవికి విశేష కుంకుమార్చల వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సంప్రదాయంలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు అర్చక వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి భ్రమరాంబ మల్లికార్జున స్వామికి చెందిన శేషవస్త్రాలను, స్వామివార్ల జ్ఞాపికలను, ప్రసాదములను అందజేశారు. అనంతరం వారిని శ్రీశైలం దేవస్థానం పరిధిలో జరిగే కార్యక్రమాలను వివరించి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
