ఆమె కన్నీళ్లు మాలో కొత్త ఆలోచనను రేకెత్తించాయి…

  • క్లౌడ్‌ కిచెన్ గా ప్రారంభ‌మై..
  • బెంగళూరు దాకా విస్తరణ..

డెజర్ట్స్‌ అంటే ఇష్టపడని వారెవరుంటారు ? కానీ, ఆరోగ్యమే మహాభాగ్యమంటున్న కాలంలో డెజర్ట్స్‌ ఎక్కువగా తింటే అది అనారోగ్య హేతువనే భయం అందరిలోనూ ఉంది. ఆరోగ్యవంతమైన ఆహారం పట్ల తన అభిరుచినే వ్యాపారంగా మలుచుకున్న ఓ వ్యక్తి, డెజర్ట్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా పిజ్జా, బర్గ‌ర్లు సహా నేటి తరం మెచ్చే విభిన్న రుచులను ఆరోగ్యవంతంగా అందిస్తూ సంచలనం సృష్టించాడు.

అతనే… సందీప్‌ జంగాల. కెపీహెచ్‌బీలో ఓ చిన్న ఔట్‌లెట్‌గా ఆయన ప్రారంభించిన యమ్మీ బీ, ఇప్పుడు హైదరాబాద్‌, బెంగళూరులలో 20 స్టోర్లకు విస్తరించింది. అంతేనా… రెండేళ్లలో మరో 100 స్టోర్లను జోడించుకోవాలనే లక్ష్యంతోనూ దూసుకుపోతుంది.

కేవలం రెస్టారెంట్‌ ఫుడ్‌ మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో కుకీస్‌ తదితర ఉత్పత్తులను క్విక్‌కామర్స్‌ సంస్ధల ద్వారా డెలివరీ చేస్తోన్న యమ్మీ బీ వ్యవస్ధాపకులు, సందీప్‌ జంగాలను పలుకరించింది. యమ్మీ బీ ప్రస్ధానం, వైవిధ్యత, విస్తరణ తదితర అంశాలను గురించి ఆయన ప్రత్యేకంగా వెల్లడించారు. ఆ విశేషాలు…

అలా మొదలైంది….

మాది విజయవాడ. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది సివిల్‌ సర్వీసెస్‌ చేయడం కోసం. ఇంటర్వ్యూ వరకూ వెళ్లినప్పటికీ విఫలమైన తరువాత దాని మీద ఆశలు పోయాయి. అంటే కోరుకున్న ఐఏఎస్‌ మాత్రం రాలేదు. దానితో విభిన్నంగా ఏదైనా చేయాలని ఐటీలోకి వెళ్లాను.

అప్పటికి నాకు ఐటీ గురించి పెద్దగా తెలిసింది కూడా లేదు. అయినా ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ మీద నాకున్న ఆసక్తితోనే నేర్చుకుని మొదలు పెట్టాను. ఓ 50 కోట్ల రూపాయల కంపెనీగా మారిన తరువాత కొవిడ్‌ రావడంతో ప్రభుత్వ ప్రాజెక్టులు తగ్గాయి. దానితో ఫిట్‌నెస్‌ అండ్‌ న్యూట్రిషన్‌పై ఓ ప్రాజెక్ట్‌ చేసి 2021లో అపోలో గ్రూప్‌కు దానిని అమ్మేశాను. నాకు మొదటి నుంచి కూడా ఇండియా కోసం ఏదైనా చేయాలని ఉండేది. క్రికెట్‌ ఆడాలని యాంబిషన్‌. అది కాలేదు. ఆ తరువాత సివిల్స్‌, ఐటీ. ఇప్పుడు ఫుడ్‌ లోకి వచ్చాను.

ఫుడ్‌ మీద ఆసక్తి…

నాకు 12 ఏళ్ల వయసు నుంచే డైటీషియన్‌తో కలిసి వర్క్‌ చేసేవాడిని. అప్పట్లో అండర్‌ 14, 19లలో ఆడటం వల్ల ఫిట్‌నెస్‌ కోసం అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఫుడ్‌ పట్ల అవగాహన ఉంది. అయితే నాకు డెజర్ట్స్‌ బాగా ఇష్టం. దానివల్ల యమ్మీ బీ ని కేవలం డెజర్ట్స్‌ ఒక్కటే, అది కూడా క్లౌడ్‌ కిచెన్‌ తరహాలో ప్రారంభిద్దామని మొదలుపెట్టాము. కెపీహెచ్‌బీలో చిన్న కిచెన్‌తో కేవలం మిల్లెట్స్‌తో తయారుచేసిన స్వీట్లు అని ప్రారంభించాము.

కొద్ది నెలలుకే క్లౌడ్‌ కిచెన్‌కు రావడం, కూర్చోవడానికి ప్లేస్‌ లేదా అని జనం అడగడం మొదలుపెట్టారు. దానితో టెంపరరీ ఫర్నిచర్‌ తెచ్చి వారికి ఏర్పాట్లు చేశాం. ఫుడ్‌ను అందరూ ఎక్కువ ఏది తింటున్నారో అదే చేద్దామనే రీతిలో సాధారణంగా ఫుడ్‌ బిజినెస్‌ ఉండేది. అది మేము మార్చాం. గిల్ట్‌ ఫ్రీ ఫుడ్‌ కాన్సెప్ట్‌ను విస్తృతం చేశాం. చాలామంది ఫుడ్‌ కన్సల్టెంట్స్‌ వద్దనే అన్నారు. అయినా మొండిగా ముందుకే వెళ్లాను.

ఆ సంఘటనతోనే…

తొలుత డెజర్ట్స్‌ మాత్రమే అందించే మేము మా స్టోర్‌ కు వచ్చిన ఓ తల్లి కన్నీళ్లతో మెనూ విస్తృతం చేశాం. ఎలాగంటే, వారమ్మాయికి సిలియాక్‌ డిసీజ్‌ ఉంది. అంటే గ్లూటెన్‌ అసలు పడదు. ఆమె కోసం మొదటిసారి మేము పిజ్జా . పాస్తా చేశాం. ఆమె అది చూసి ఏడ్చేసింది.

ఆమె కన్నీళ్లు మాలో కొత్త ఆలోచనను రేకెత్తించింది. అలా నెమ్మదిగా డెజర్ట్స్‌తో పాటుగా ఫుడ్‌ కూడా అందించడం మొదలుపెట్టాము. అదే సమయంలో మాకు జూబ్లీహిల్స్‌లో ఓ ప్లేస్‌ దొరికింది. అక్కడకు సెలబ్రిటీలు రావడం, తమ కారు డ్రైవర్లతో ఫుడ్‌ తీసుకువెళ్లడంతో మరింతగా ప్రాచుర్యం పొందాం.

యమ్మీ బీ ప్రత్యేకత అదే…

షుగర్‌ ఫ్రీ, గ్లూటెన్‌ ఫ్రీ పదార్ధాలు మాత్రమే కాకుండా ఇండియాలో ఒకే ఒక్క గిల్ట్‌ ఫ్రీ కేఫే ఛైన్‌ ఇది. మేము తయారుచేసే పదార్ధాలలో మైదా, గ్లూటెన్‌, షుగర్‌ వంటివి ఉండవు. మేము చేసినంత రీతిలో వెరెవ్వరూ పూర్తి స్థాయిలో ఈ తరహా ఉత్పత్తులను చేయలేదు. ఆర్‌ అండ్‌ డీ పై మేము ఎక్కువగా దృష్టి సారించాం. సైనిక్‌పురిలో మాకు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఉంది.

ఇక్కడ 40 మంది చెఫ్‌లు ఉంటారు. అక్కడ నిరంతరం వారు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. మిల్లెట్స్‌తో ఎలాంటి నిల్వకారకాలు లేకుండా ఓ ఉత్పత్తి చేయాలంటే, అది అందరికీ నచ్చే, అందరూ మెచ్చే రీతిలో తయారుచేయడం చాలా కష్టం, అది మా చెఫ్‌లు సాధ్యం చేయగలిగారు. మా ఆర్‌ అండ్‌ డీ యే మా బలం.

ఎలాంటి షుగర్‌ ఉండదు…

షుగర్‌ ఫ్రీ అంటే చాలా మంది బ్రౌన్‌ షుగర్‌ లేదంటే స్వీటనర్లను వాడుతుండటం జరుగుతుంది. అయితే, మా దగ్గర షుగర్‌ ఫ్రీ అంటే షుగర్‌ ఫ్రీ, అంతే. మరెలా తియ్యదనం వస్తుంది అంటే, మేము స్టీవియా ఆకుల పొడి వాడుతుంటాం. అలాగే ఎస్‌ఓఎస్‌ అనేది వాడుతుంటాం, ఇది ద్రవ రూపంలో ఉంటుంది. అన్ని ఉత్పత్తులూ మైదా లేకుండా, గోధుమలు లేకుండా తయారుచేస్తాం. మిల్లెట్స్‌ మాత్రమే వాడుతుంటాం. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు ఇలా అన్నీ వాడుతుంటాం.

మిల్లెట్స్‌తో చేసినవి రుచికరంగా ఉండవా…

చాలామందికి ఆరోగ్యకరమైనది తినాలని ఉన్నా, అవకాశాలు తక్కువగా ఉంటాయి, మా దగ్గర ఆ సమస్య లేదు. అదే మా యుఎస్‌పీ. మిల్లెట్స్‌తో చేసినవి రుచిగా ఉండవనేది చాలా మంది నమ్మిక. తయారీ విధానం, సహజంగానే మిల్లెట్స్‌లోని రుచి కారణంగా అలా అనిపిస్తుంది. అయితే, మా దగ్గర ఆ సమస్య లేదు. ప్రతి ఒక్కరి అభిరుచులకు తగినట్లుగా ఈ మిల్లెట్స్‌తో తయారుచేసిన ఉత్పత్తులు ఉంటాయి. మా ఆర్‌ అండ్‌ డీ ఎంత బలంగా ఉంటుందంటే, యమ్మీ బీ ఉత్పత్తులతో పాటుగా సాధారణ ఉత్పత్తులను రుచి చూస్తే ఆ వైవిధ్యతను వారు గుర్తుపట్టలేరు.

మేము వచ్చి మీకు చెబితేనే ఆ రుచిలో వైవిధ్యత తెలుస్తుంది. మీకు మీరుగా ఆ వైవిధ్యత కనుగొనడం దాదాపు అసాధ్యం. మా కస్టమర్‌ రిటెన్షన్‌ దాదాపు 60% ఉందంటే కారణం ఈ ప్రత్యేకత. ఒక్కసారి వచ్చిన వారు మరలా వస్తుంటారు. హెల్తీ కుకీలు, జొన్నలతో చేసిన కుకీలను అయినా సాధారణంగా ఒకసారి తిన్న తరువాత మరలా తినాలంటే ఆలోచిస్తారు. మా దగ్గర ఆ సమస్య లేదు. రుచి, ఆరోగ్యం మధ్య ఉన్న అంతరం పూరించడం వల్లనే మా ఉత్పత్తులు ఇంతగా ప్రాచుర్యం పొందాయి.

మా ఆర్‌ అండ్‌ డీలో ఓ ఉత్పత్తి తుది రూపు పొందాలంటే 2–3 నెలలు పనిచేస్తాం. త్వరలోనే మేము కుకీస్‌ విడుదల చేయబోతున్నాము. దానికి దాదాపు మూడు నెలలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాము. మా కస్టమర్లు వీటి వల్ల పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్‌ ఇన్‌స్టామార్ట్‌ జొమాటో వంటి వాటిలో అమ్ముతున్నాం. మిల్లెట్‌ చిప్స్‌ విడుదల చేయబోతున్నాం. కారం పొడి, కర్రీ లీఫ్‌ పౌడర్‌ వంటి ఫ్లేవర్స్‌తో వీటిని తీసుకురానున్నాం. కుకీస్‌, బిస్కెట్స్‌ తీసుకువస్తున్నాం. ఈ దీపావళికి 9–10 ప్రొడక్ట్స్‌ వచ్చాయి.

హైదరాబాద్‌లో ఇవి ఎక్కువ…

బొబ్బ టీ , దుబాయ్‌ మినీ బర్గర్లు వంటివి ఇప్పుడు అందిస్తున్నాము. మేము ఏది చేసినా వాటిలో షుగర్‌ లేదంటే గ్లూటెన్‌ వంటివి ఉండవు. హైదరాబాద్‌లో మా పిజ్జాలను ఎక్కువగా తింటారు. దాని తరువాత బర్గర్లు., పాస్తాలు, డెజర్ట్స్‌ ఎలాగూ మా స్పెషాలిటీ. అలాగే హై ప్రొటీన్‌ బౌల్‌ కూడా ఎక్కువగా తీసుకుంటారు. మేము మా ఉత్పత్తులన్నీ అంటే సా్‌స్‌లు కూడా మేమే తయారుచేసుకుంటారు. రెడీ టు యూజ్‌ ఉత్పత్తులను అసలు వాడము.

పెట్టుబడులు ఎలాగున్నాయంటే…

తొలుత పెట్టుబడులన్నీ నావే. ఆ తరువాత కాంటినెంటల్‌ కాఫీ వారిని మా బోర్డులోకి తీసుకున్నాం. జూబ్లీహిల్స్‌లో మొదటిస్టోర్‌ ప్రారంభమైన తరువాత మైల్డీప్‌ క్యాపిటల్‌ వారు 7 కోట్లు పెట్టుబడి పెట్టారు. అప్పుడు విస్తరణ చేశాం. అక్టోబర్‌–నవంబర్‌లలో మైల్డీప్‌ తో పాటుగా బెంగళూరులో కొన్ని వెంచర్‌ క్యాపిటల్స్‌ 16 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.

యమ్మీ బీ విస్తరణ ప్రణాళికలు…

హైదరాబాద్‌లో మా స్టోర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కిచెన్‌లు 13 ఉండగా, స్టోర్లు ఆరు ఉన్నాయి. త్వరలోనే మరోటి ప్రారంభం కానుంది. కొండాపూర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, కోకాపేట, సైనిక్‌పురి, నల్లగండ్లలో ఉన్నాయి. ఇటీవలనే దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కిచెన్‌ను తెరిచాం. దానిని కేవలం పంపిణీ కోసమే ప్రారంభించాం.

ఈ నెలలోనే బెంగళూరులో నాలుగు స్టోర్లను ప్రారంభించేందుకు ప్రణాళిక చేశాము. మరి పుట్టిన ఊరు విజయవాడలో అంటే… విజయవాడలో 10 స్టోర్లు పెట్టేంత మార్కెట్‌ లేదు. కానీ మూడు నాలుగు స్టోర్లు పెట్టేంత మార్కెట్‌ ఉంది. త్వరలో దక్షిణాదిలో పలు టియర్‌ 2 నగరాలలో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. మాది మిడ్‌ లెవల్‌,అప్పర్‌ మిడ్‌లెవల్‌ బ్రాండ్‌గా ఉంచాలనేది మా ఆలోచన. రెండేళ్లలో 120 స్టోర్లను ఏర్పాటుచేయటానికి వ్యూహ రచన చేశాం. అయితే ఫ్రాంచైజీ మోడల్‌లో కాకుండా అన్నీ కంపెనీ యాజమాన్య నిర్వహణలోనే ఉంటాయి.

Leave a Reply