అమెరికా : అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురూ మృతి చెందారు. మృతుల్లో ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని ఒక భాగం విరిగిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది.