‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ !! ఇకపై అన్నీ చవకే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తాజా జీఎస్టీ (GST) మార్పులను “కొత్త తరం సంస్కరణలు”గా అభివర్ణించారు. ఈ మార్పులతో మధ్యతరగతి ప్రజలకు పొదుపు పెరుగుతుందని, యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

మోదీ కొత్త జీఎస్టీ రేట్లను “జీఎస్టీ బచత్ ఉత్సవ్”గా ప్రకటించారు. ఈ కొత్త జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల రోజువారీ వస్తువుల ధరలు తగ్గి, వినియోగం ఆధారిత వృద్ధికి ఊతమిస్తుందని ఆయన అన్నారు.

‘ఒక దేశం, ఒక పన్ను’ కలను సాకారం చేసిన జీఎస్టీ. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చి, జీఎస్టీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చిందని మోదీ పేర్కొన్నారు.

జీఎస్టీ వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ, పన్ను స్లాబులను 5% & 18% అనే రెండు ప్రధాన స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. ఇకపై 99% వస్తువులు 5% స్లాబ్ కిందకి వస్తాయి. నిత్యావసర వస్తువులు, మందులు, బీమా ప్రీమియంలు వంటివి మరింత చౌకగా లభిస్తాయి. ఈ సంస్కరణలతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతం..

ఈ మార్పులు ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి పెద్ద లాభం చేకూరుస్తాయి. పెట్టుబడులు పెరగడం, వ్యాపారం సులభతరం కావడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ మరింత బలోపేతం అవుతుందని మోదీ పేర్కొన్నారు.

సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక మార్పులను ప్రకటించారు. ఇందులో భాగంగా, గతంలో ఉన్న 12% & 28% స్లాబులను రద్దు చేసి కొత్త పన్ను నిర్మాణాన్ని తీసుకొచ్చారు.

కొత్త జీఎస్టీ స్లాబ్ నిర్మాణం

సాధారణ వినియోగ వస్తువులపై 5% & 18% రెండు ప్రధాన పన్ను శ్లాబులు అమలు చేయనున్నారు. ఈ స్లాబులు రోజువారీ అవసరాలు, వినియోగ వస్తువులు, మందులు & బీమా ప్రీమియంలపై వర్తిస్తాయి.

అదనంగా, విలాసవంతమైన & నిషేధిత వస్తువులకు 40% కొత్త స్లాబ్ ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లు, చక్కెర కలిగిన పానీయాలు ఉన్నాయి. అంతేకాక, 350 సీసీకి పైగా ఉన్న మోటార్‌సైకిళ్లు, లగ్జరీ కార్లు, యాచ్‌లు, హెలికాప్టర్లు వంటి విలాసవంతమైన వస్తువులు కూడా ఈ 40% స్లాబ్‌కు లోబడి వస్తాయి.

‘స్వదేశీ’ పిలుపు…

ప్రధాని మోదీ ఈ ప్రసంగంలో ‘స్వదేశీ’ ఉద్యమానికి కూడా పిలుపునిచ్చారు. భారత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఈ ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భాగం కావాలని ఆయన కోరారు. ఈ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి వర్గాలకు ‘డబుల్ బొనాంజా’ అని ఆయన అభివర్ణించారు.

Leave a Reply