government hospital | డెలివరీలు పెంచాలి..

government hospital | డెలివరీలు పెంచాలి..

  • పేదలకు ప్రభుత్వ వైద్యం అందాలి
  • ఐటిడిఎ పిఓ రాహుల్

government hospital | బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ప్రభుత్వాసుపత్రిలో నిరుపేదలకు సేవలు అందించాలని మారుమూల గిరిజన గ్రామాల నుండి నిరుపేదలైన గిరిజనులు సిహెచ్ సి ఆసుపత్రికి వస్తూ ఉంటారని వారి పట్ల డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని రకాల టెస్టులు నిర్వహించి తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

ఈ రోజు బూర్గంపాడు ప్రభుత్వ సిహెచ్ సి వైద్య శాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి లేబరేటరీ, ఆపరేషన్ థియేటర్, గర్భిణీ స్త్రీల కాన్పుల గది, అవుట్ పేషెంట్ల గది, అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది, మందులు నిలువచేసే గది, కొత్తగా నిర్మాణం చేపడుతున్న సిహెచ్సి పనులను పరిశీలించి, రోగులకు అందుతున్న స్కానింగ్ సేవలు, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల, స్టోర్ రూమ్ లో ఉన్న మందుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి అవుట్ పేషెంట్లను, వార్డులలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలనుండి వివిధ రకాల జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి గిరిజనులు వస్తూ ఉంటారని, వారికి సరైన వైద్యం చేసి మందులు అందజేయాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా వారి గ్రామాల నుండి అంబులెన్స్ లో తీసుకొని రావాలని, డెలివరీ అయ్యే వరకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది లేనిది పరిశీలించి, తల్లితోపాటు బిడ్డ కూడా సక్రమంగా వైద్య చికిత్సలు చేయాలని అన్నారు. పీహెచ్సీ పరిధిలో పనిచేసే సిబ్బంది గర్భిణీ స్త్రీల పట్ల జాగ్రత్తలు తీసుకొని వారికి నెలసరి చికిత్సలు ఏ విధంగా తీసుకోవాలో అవగాహన కల్పించాలని అన్నారు.

వాతావరణం మార్పు వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిహెచ్ సి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులను ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించాలని, వివిధ రకాల టెస్టుల కోసం పేషెంట్లను ఎవరిని ప్రైవేట్ ల్యాబ్ లకు పంపించకూడదని, ఎవరైనా పేషెంట్లు ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్టింగులు నిర్వహించినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అలాగే ఆసుపత్రి పరిసరాలు, వార్డులు ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రెండు కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న కొత్త సి హెచ్ సి పనులలో వేగవంతం చేసి వర్షాకాలం వచ్చేసరికి కొత్త భవనంలో సిహెచ్సి నడిచే విధంగా చూడాలని అన్నారు.

అనంతరం బూర్గంపాడు హుడ్ యార్డ్ లోని జిపిఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలను ఇతర అంశాలను విద్యార్థుల చేత బోర్డుపై వ్రాయించి దానికి సంబంధించిన తాత్పర్యాలు పిల్లలను అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో సంబంధిత ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలు విద్యార్థులు సరిగా చెప్పకపోవడం ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందో అర్థమయిపోతుందని,

ఈ నెలలో మరల ఈ పాఠశాలను సందర్శిస్తానని ఈ లోపల పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని ప్రతి పదాలు, గుణకారాలు, భాగాహారాలు, చతుర్వేదికలు అన్ని పిల్లలు చెప్పే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, లేనియెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులందరినీ పరీక్షలు సక్రమంగా రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, పర్యవేక్షకుడు ముక్కంటి ఈశ్వరరావు, డాక్టర్లు అనిత, నిషార్, సిహెచ్సి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply