కాకినాడ : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో కూటమి అభ్యర్ధి మెజార్టీ కొనసాగుతోంది.ఇప్పటికే ఆరో రౌండు కౌటింగ్ పూర్తయింది. ఈ రౌండ్ ముగిసే నాటికి కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం 60 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.. ఆరో రౌండ్ పూర్తయ్యేనాటికి మొత్తం 1,68,000 ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. అందులో చెల్లుబాటు అయినవి 1,53,182 కాగా, 14,818 చెల్లనివిగా ఉన్నాయి. ఆరో రౌండ్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 16,254 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తంగా 96,291 ఓట్లు వచ్చాయి.
ఆరో రౌండ్లో పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకి 5,949 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఓట్లు 35,614కు చేరాయి. ఈ రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి రాజశేఖరం 60,677 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోలవగా.. మొత్తం 8 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు 700మంది కౌంటింగ్ సిబ్బంది మూడు షిప్టుల్లో పాల్గొంటున్నారు.