కాకతీయ వెంటేజ్ రోడ్డు కబ్జా….

కాకతీయ వెంటేజ్ రోడ్డు కబ్జా….
- గోడ నిర్మాణంపై హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
భీమారం, ఆంధ్రప్రభ : చింతగట్టు సుభాష్ నగర్ నుంచి కాకతీయ వెంటేజ్ లోకి వెళ్లే రోడ్డు కబ్జాకు గురైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు తన పట్టా భూమి అంటూ బిల్లా సుభాషిణి రెడ్డి అల్లుడు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి చెందారు. గతంలోనే ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు.
కాకతీయ వెంటేజ్ డెవలపర్లు ఈ రోడ్డును మున్సిపల్‌కు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, రోడ్డుకు అడ్డంగా ప్రహరీ (గోడ) నిర్మాణం జరగడంతో నివాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. రోడ్డు కబ్జా విషయమై ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని బాధితులు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.
కాకతీయ వెంటేజ్ డెవలపర్లు మున్సిపల్‌కు రోడ్డును గిఫ్ట్ చేసిన నేపథ్యంలో, రోడ్డుపై గోడ నిర్మాణం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు చేశారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, సుభాష్ నగర్ నివాసుల రాకపోకలకు అడ్డుకాకుండా రోడ్డుమీద నిర్మించిన గోడను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
