GHMC | మహా బల్దియా..

GHMC | మహా బల్దియా..

  • 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌ల విలీనం
  • మొదట రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం
  • తర్వాత జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ఆవెూదం
  • అత్యంత రహస్యంగా ఉంచి.. టేబుల్‌ ఐటంగా..
  • సాయంత్రం 4 వరకు గందరగోళంగా కౌన్సిల్‌
  • విలీన ప్రతిపాదనతో ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి
  • ఆవెూదం పొందినట్టు ప్రకటించి సమావేశాన్ని ముగించిన మేయర్‌
  • 650 చ.కి.మీ.ల నుంచి 948 చ.కి.మీల వరకు పెరగనున్న పరిధి

హైదరాబాద్‌ సిటీ బ్యూరో, ఆంధ్ర ప్రభ : ఎప్పటి నుంచో అనుకుంటోన్న రోజు రానే వచ్చింది. కాకపోతే ఇప్పటికిప్పుడు ఊహించని పరిణామంలా జీహెచ్‌ఎంసీలో 27 మునిసిపల్‌ బాడీలను విలీనం చేస్తూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ఆమోదం తెలిపింది.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో టేబుల్‌ ఐటంగా తీసుకుని ప్రవేశపెట్టగా… బ్రేక్‌ అనంతరం వెంటనే ఆమోదించడం సంచలనంగా మారింది. ఇక విలీన ప్రక్రియను ఆమోదించే క్రమంలో మిత్రపక్ష ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్‌ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా మేయర్‌ వెంటనే కౌన్సిల్‌ ఆమోదం పొందినట్టు ప్రకటించి సమావేశాన్ని ముగించారు.

ఇక ఈ ప్రతిపాదనకు ముందు రాష్ట్రకేబి నెట్‌ నిర్ణయం తీసుకుని కౌన్సిల్‌ ఆమో దానికి ప్రతిపాదన చేశారు. దీంతో, చుట్టు పక్కల మునిసిపల్‌ బాడీల విలీనానికి మార్గం సుగమమైంది. ఇక జీ హెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విలీన ప్రక్రియ తర్వాతే జరుగనున్నాయి.

ప్రభుత్వ ప్రతిపాదనకు GHMC కౌన్సిల్‌ ఆమోదం..

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధి, దానిని ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్‌లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రీయాంబుల్‌ను కార్పొరేషన్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఉంచింది.

పెరిఫెరల్‌ మున్సిపాలిటీల్లో అభివృద్ధి వ్యత్యాసాలు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడి వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించింది. ఒకేతీరుగా ప్రణాళిక, మెరుగైన పౌరసేవలు, సమన్వయ మెట్రోపాలిటన్‌ అభివృద్ధి కోసం విలీనం అవసరమని అభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955 ప్రకారం జీహెచ్‌ఎంసీ ఈ ప్రతిపాదనపై పరిశీలన చేసి అవసరమైన అధ్యయనం నిర్వహించి తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.

ఈ మేరకు సర్కార్‌ మెమో నం.5924/ఎంఏ(1)/2024, తేదీ 21-11-2025 ప్రకారం ప్రీయాంబుల్‌ను జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ముందు టేబుల్‌ ఐటమ్‌-2గా ఉంచారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ఈ ప్రీయాంబుల్‌కు ఆమోదం తెలిపింది.

విలీనం కానున్న మునిసిపాలిటీలు, కార్పోరేషన్‌లు ఇవే…

ఇక విలీనం కానున్న వాటిల్లో రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయాంజల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ మునిసిపాలిటీలు కాగా, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట్‌, బోడుప్పల్‌, కార్పొరేషన్‌లున్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జి ల్లాలోని దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌ మునిసిపాలిటీలు కాగా, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌ కార్పోరేషన్‌లున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్పూర్‌ మునిసిపాలిటీలున్నాయి.

పెరగనున్న మహానగర విస్తీర్ణం… జనాభా

27 మున్సిపాలిటీల విలీనం తర్వాత మహానగర పరిధి భారీగా పెరగనుంది. ప్రస్తుతం 650 చ.కి.మీ.ల పరిధిలో విస్తరించి ఉన్న జీహెచ్‌ఎంసీలో 2021 జనాభా లెక్కల ప్రకారం 1 కోటి రెండు లక్షలుగా ఉంది. అయితే, అనధికారికంగా ఇప్పటికే కోటి 30 లక్షల పైనే జనాభా ఉంది. విలీనం తర్వాత పరిధి మరో 298 చ.కి.మీ.లు పెరిగి 948 చ.కి.మీ.లకు పెరిగి జనాభా 1 కోటి 50 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా. గ్రేటర్‌ చుట్టూ ఉన్న 7 మునిసిపల్‌ కార్పోరేషన్‌లు, 20 మునిసిపాలిటీలు, ఓఆర్‌ఆర్‌ వరకు పరిధి పెరిగితే వీటి పరిధి ఇతర జిల్లాల వరకూ వ్యాపిస్తుంది.

విలీనం తర్వాతే బల్దియా ఎన్నికలు…

వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో బల్దియా పాలకమండలి ముగియనుంది. ఈ తర్వాత స్పెషల్‌ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించనుంది. వీటి విలీనం తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుక్కారణం, జీహెచ్‌ఎంసీలో వాటి విలీన ప్రక్రియ అంత సులభమైనది కాదని అధికారుల అంచనా. పాలకమండలి గడువు ముగిసిన తర్వాత కనీసం 5,6 నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక శివారు ప్రాంతాల విలీనానికి పలు సాంకేతిక సమస్యలతో పాటు స్థానిక రాజకీయ అంశాలు, సమాజిక అంశాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ దాటుకుని విలీన ప్రక్రియ పూర్తిగా జరగాలంటే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెడితే మాత్రం విలీనాన్ని ఆపడం ఎవరికీ సాధ్యపడదని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే, విలీనానికి కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరగనున్నయని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply