సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ

సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ
ఆగిన గ్రానైట్ ఎగుమతులు తగ్గిన అమ్మకాలు
పెరిగిన ఖర్చులతో నష్టాల్లో మగ్గుతున్న యూనిట్లు
టైల్స్, చైనా గ్రానైట్ తో మార్కెట్ క్షీణత
మూతబడిన 375 గ్రానైట్ పరిశ్రమలు
ఉపాధి కోల్పోతున్న వేలాది కార్మిక కుటుంబాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా ఒకప్పుడు గ్రానైట్ పరిశ్రమ పట్టుకొమ్మ. నాణ్యమైన బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లతో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన ఈ రంగం క్రమంగా కుంచించుకుపోవడం స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకవైపు చైనా బ్లాక్ విదేశీ మార్కెట్లను ముంచెత్తడం, మరోవైపు స్థానికం మార్కెట్ ను టైల్స్ ఆక్రమించడంతో గ్రానైట్ పరిశ్రమ మనుగడను కోల్పోతుంది.
ఇప్పటివరకు జిల్లాలో 375 గ్రానైట్ పరిశ్రమలు శాశ్వతంగా మూతపడ్డాయి. మరో 130 తాత్కాలికంగా తాళాలు పడ్డాయి. భారీగా వచ్చే విదేశీ మారకద్రవ్యం తగ్గింది. స్థానిక సంస్థలకు సెస్ రూపంలో రావలసిన ఆదాయం కూడా తగ్గింది. కరెంట్ బిల్లులు కూడా కట్టలేకుండా గ్రానైట్ పరిశ్రమల యజమానులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిశ్రమనే నమ్ముకున్న వేలాదిమంది కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి.

చిత్తూరు జిల్లాలో 1989లో మైన్స్, జియాలజీ విభాగం ఏర్పాటుతో ఖనిజ వనరుల వినియోగం వ్యవస్థీకృతంగా ప్రారంభమైంది. అనంతరం 2003లో జిల్లా విభజన, 2019లో డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం స్థాపనతో పరిపాలన బలోపేతం అయినప్పటికీ, ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అదుపులోకి రావడం లేదు. జిల్లాలో 964 క్వారీ లీజులు, 547 ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉండటం ఈ రంగం విస్తృతిని సూచిస్తుంది. కుప్పం, గుడిపాల, యాదమరి, శాంతిపురం, గంగాధర నెల్లూరు వంటి ప్రాంతాలు గ్రానైట్ తవ్వకాల కేంద్రాలుగా ఎదిగాయి.

ఒకప్పుడు చిత్తూరు నుంచి చైనా, ఇటలీ, యూరప్ దేశాలకు భారీగా గ్రానైట్ ఎగుమతులు జరిగేవి. విదేశీ మారకద్రవ్యాన్ని దేశానికి అందించే ప్రధాన రంగంగా ఇది నిలిచింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, రవాణా మార్గాలు దెబ్బతినడం, షిప్పింగ్ ఛార్జీలు విపరీతంగా పెరగడం వల్ల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. గతంలో ఒక కంటైనర్‌కు 21 డాలర్లుగా ఉన్న రవాణా ఖర్చు ఇప్పుడు 28 డాలర్లకు చేరుకోవడంతో విదేశీ కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీని ప్రభావంగా విదేశీ మారకద్రవ్యం గణనీయంగా తగ్గిపోయి.
ప్రభుత్వ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక పరిశ్రమలో అంతర్గత సమస్యలు మరింత తీవ్రంగా మారాయి. జిల్లాలో ఒకప్పుడు ఉన్న 675 గ్రానైట్ పరిశ్రమల్లో 375 యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన వాటిలో కూడా చాలా యూనిట్లు నిలబడటానికి పోరాడుతున్నాయి. ప్రస్తుతం కేవలం 100 నుంచి 120 పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ఎగుమతులు దాదాపుగా ఆగిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. యజమానులు నష్టాలను భరించలేక యంత్రాలను తుక్కు కింద విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరగడం పరిశ్రమను కుదేలు చేస్తోంది. ఒక అడుగు గ్రానైట్ ప్రాసెసింగ్‌కు సుమారు 48 రూపాయలు ఖర్చవుతుండగా, మార్కెట్‌లో కొనుగోలుదారులు 45 రూపాయలకే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో ప్రతి యూనిట్ నష్టాలతోనే నడుస్తోంది. డ్రిల్లింగ్ బిట్స్ ధరలు 250 రూపాయల నుంచి 1200 రూపాయలకు పెరగడం, డీజిల్ వినియోగం రోజుకు వేల లీటర్లుగా ఉండటం, విద్యుత్ చార్జీలు నెలకు లక్ష రూపాయల వరకు చేరుకోవడం యజమానులను తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టింది. బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించలేక చాలా మంది యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమయంలో మార్కెట్ ధోరణులు కూడా పరిశ్రమకు వ్యతిరేకంగా మారాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టైల్స్ వినియోగం పెరగడం వల్ల గ్రానైట్‌కు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. చైనా వంటి దేశాల నుంచి తక్కువ ధరలో బ్లాక్ గ్రానైట్ మార్కెట్‌లోకి రావడం కూడా చిత్తూరు గ్రానైట్‌కు పోటీగా మారింది. దీంతో స్థానిక ఉత్పత్తులు అమ్ముడవ్వకుండా నిల్వలు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్నవారు కార్మికులు. జిల్లాలో సుమారు 20 వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఒక గ్రానైట్ యూనిట్‌పై సగటున 2000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతుంటారు. క్వారీల్లో పనిచేసే కూలీలు, లారీ డ్రైవర్లు, పాలిషింగ్ కార్మికులు, ఏజెంట్లు ఇలా అనేక వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. డీజిల్ సరఫరా కూడా కీలక సమస్యగా మారింది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఒకవేళ డీజిల్ సరఫరాలో అంతరాయం కలిగితే ఉత్పత్తి సగానికి పడిపోతుందని యజమానులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో పనులకు అనుకూల సమయం ఉన్నప్పటికీ, ఈ సమయంలో కూడా పనులు నిలిచిపోవడం పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యజమానులు, కార్మికులు కోరుతున్నారు. విద్యుత్ చార్జీలలో రాయితీలు ఇవ్వడం, స్థానిక పన్నులను తగ్గించడం, బ్యాంకు రుణాలకు గడువు పొడిగించడం, ఎగుమతులపై ఉన్న అడ్డంకులను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
