గ్యాస్ కొరతతో హోటల్ రంగంలో అలజడి..

గ్యాస్ కొరతతో హోటల్ రంగంలో అలజడి..

  • ఆన్‌లైన్ ఫుడ్ సేవలకు బ్రేక్..
  • ప్రతి సోమవారం రెస్టారెంట్లు మూసివేత..
  • బ్లాక్ మార్కెట్ అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి..
  • హోటల్ సంఘాల అత్యవసర సమావేశం
  • పలు నిర్ణయాలు తీసుకున్న యజమానులు..

ఎన్టీఆర్, ఆంధ్రప్రభ బ్యూరో : కమర్షియల్ గ్యాస్ కొరతతో రాష్ట్రంలో హోటల్ రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, గ్యాస్ సరఫరాలో అంతరాయం నేపథ్యంలో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ సంఘాలు అత్యవసర సమావేశం బుధవారం విజయవాడలో నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్, విజయవాడ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసర సమావేశం నిర్వహించారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటళ్ల నిర్వహణ పై అనిశ్చితి నెలకొన్నట్లు హోటల్ యజమానులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్లను ఎలా కొనసాగించాలి. గ్యాస్ సరఫరా సమస్య కొనసాగితే ఎంతకాలం కార్యకలాపాలు నిలిపివేయాల్సి వస్తుందనే అంశాల పై విస్తృతంగా చర్చించారు.

అనంతరం విలేకరులతో విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలుగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలైన స్విగ్గీ, జొమాటో వంటి వేదికల ద్వారా వచ్చే ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో ఆన్‌లైన్ వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లు మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. హాస్పిటాలిటీ రంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం అందిస్తున్న రంగమని, అధిక ఉపాధి కల్పించే రంగంగా దీన్ని ప్రాధాన్యంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్ కాలంలో ఎదురైన సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా మళ్లీ కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో హోటళ్ల కార్యకలాపాలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం ద్వారా వాణిజ్య గ్యాస్ వినియోగాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఈ నిర్ణయం స్ట్రీట్ ఫుడ్ విక్రేతల నుంచి పెద్ద హోటళ్ల వరకు అందరికీ సమానంగా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి మాట్లాడుతూ.. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత వాణిజ్య గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గ్యాస్ కొరత పేరుతో కృత్రిమ సమస్యలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని హోటల్ సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పాటయ్యాయని తెలిపారు. హోటల్ పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించేందుకు హోటల్ అసోసియేషన్ జేఏసీ ప్రతినిధులు త్వరలో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వాణిజ్య గ్యాస్ వినియోగంలో తమవంతు సహకారం అందిస్తామని హోటల్ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply