Gali Janardhan Reddy | హత్యాయత్నం..

Gali Janardhan Reddy | హత్యాయత్నం..

Gali Janardhan Reddy, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బళ్లారిలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు బ్యానర్లు కట్టారు. అయితే.. ఈ బ్యానర్లు కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. అతడు తన అనుచరుడేనని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ధ్రువీకరించారు.

గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు కట్టిన బ్యానర్లను ఆయన మద్దతుదారులు అడ్డుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా ముదిరి ఇరువర్గాలు రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడమే కాకుండా గాల్లోకి కాల్పులు జరిపి, బాష్పవాయువును ప్రయోగించారు.

గాలి జనార్థన్ రెడ్డి వర్గీయులే.. తన మద్దతుదారుడిని హత్య చేశారని.. గాలి జనార్థన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని భరత్ రెడ్డి ఆరోపించారు.. మరో వైపు తనను చంపడానికి భరత్ రెడ్డి పన్నిన పన్నాగమని గాలి జనార్థన్ రెడ్డి ఆరోపించారు. తన సిబ్బంది పై కాల్పులు జరిపారన్నారు. దీనికి సంబంధించిన బుల్లెట్టు మీడియాకు చూపించారు. ఈ ఘటనతో బళ్లారిలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనతో ఎన్నడూ లేనంతగా పరిస్థితి తీవ్రంగా మారింది.

Leave a Reply