ADB |కోర్టు ధిక్కారం కేసులో.. అటవీశాఖ కార్యాలయాల ఫర్నిచర్ జప్తు

జన్నారం, జులై 3 (ఆంధ్రప్రభ): గతంలో తాళ్ల పేట ఫారెస్ట్ రేంజు పరిధిలో పనిచేసిన దినసరి ఉద్యోగి దర్శనాల రాజంకు చెల్లించవలసిన వేతనం డబ్బులను చెల్లించినందుకు కోర్టు ధిక్కరణలో భాగంగా హైదరాబాదులోని పీసీసీఎఫ్, ఆదిలాబాదులోని సీఎఫ్, జన్నారంలోని ఎఫ్డీఓ, తాళ్లపేటలోని ఎఫ్ఆర్ఓ కార్యాలయాలలోని రూ.15,89,700.00 విలువగల ఫర్నిచర్ ను కోర్టు ఉద్యోగులు జప్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ ఆఫీస్ లోని, తాళ్లపేట రేంజ్ ఆఫీసులలోని ఫర్నిచర్ ను కోర్టు ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం కోర్టు ఉద్యోగులు జప్తు చేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ వాసి దర్శనాల రాజం 1984 నుంచి దినసరి కూలీగా తాళ్ల పేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పనిచేశారు. ఆయనను వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించడంతో బకాయి జీతాన్ని వడ్డీతో సహా చెల్లించాలని లేబర్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అటవీశాఖ పాటించకపోవడంతో నేడు ఆశాఖ ఆస్తులను జప్తు చేసి లక్షేట్టిపేట కోర్టుకు తరలించారు. ఈ విషయమై స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ ను ఫోన్లో సాయంత్రం సంప్రదించగా, గోదావరిఖని లేబర్ కోర్టు న్యాయమూర్తి, దర్శనాల రాజం వ్యవహారంలో ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు చేనున్నామన్నారు.

Leave a Reply