అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద

అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద

  • గుర్తు తెలియని వ్యక్తుల దారుణం
  • నాలుగు గోమాతలు గాయాలు, కోళ్లు దగ్ధం
  • ఉగాది ముందు రోడ్డునపడ్డ కుటుంబం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: మనుషుల హృదయాలను కదిలించే విషాద ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు చల్లూరిపల్లిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ నిరుపేద రైతు ఇంటికి నిప్పంటించడంతో ఆ కుటుంబం కళ్లముందే జీవనాధారం బూడిదైపోయింది.

చెలిమేటి లింగయ్య, సుగుణ దంపతుల ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఉగాది పండుగ నేపథ్యంలో కొడుకు సంతోష్ ఇంటికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో కట్టేసిన ఎనిమిది ఆవుల్లో నాలుగు ఆవులు తీవ్రంగా కాలిపోయి నడవలేని స్థితికి చేరాయి. 20కి పైగా కోళ్లు అగ్నిలో మృతి చెందగా, రూ.10 వేల నగదు, వర్షాకాలంలో పండించిన 20 బస్తాల వడ్లు, బట్టలు అన్నీ బూడిదయ్యాయి.

కాలిపోయిన ఇంటి అవశేషాల మధ్య నిలబడి బాధితులు లింగయ్య, సుగుణలు కన్నీరు మున్నీరుగా విలపించారు. మాకు ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు… మా జీవితం ఒక్కసారిగా చీకట్లో పడిపోయింది అంటూ వారి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. గాయపడిన ఆవులకు చికిత్సకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని, మొత్తం రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణ సహాయం అందించాలని కోరారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిప్పంటించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగాది పండుగ ముందురోజే ఇల్లు కోల్పోయిన ఈ కుటుంబం పట్ల ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply