Former MLA | పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు

Former MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు నోటీసుల్లో పేర్కొంది.
ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆదేశించింది. అయితే ఇచ్చిన సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది.
ఈనెల 14వతేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు మెరుపు దాడులు చేశారు. అక్కడ కొకైన్‌తో సహా డ్రగ్స్ సీజ్ చేశారు.
పార్టీలో ఉన్న రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మతో సహా పలువురికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. అయితే పోలీసులను చూసిన వెంటనే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
