సాగు–తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తా…

- ఆశీర్వదిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటా
- సర్పంచ్ అభ్యర్థి ముల్కల అంజలి నర్సయ్య
పెద్దపల్లి జిల్లా, ధర్మారం (ఆంధ్రప్రభ) : ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి ముల్కల అంజలి నర్సయ్య బరిలో ఉన్నారు. ఒక్కసారి అవకాశం కల్పించి తనను గెలిపిస్తే ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు చేసి అభివృద్ధికి తమతమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు.
అభివృద్ధి పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తూ, ప్రతి సంవత్సరం ఎస్ఆర్ఎస్పి కాలువలో రైతులు, యువత సహకారంతో పూడికతీత నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పాక్స్ చైర్మన్ ముత్యాల బాలరాంరెడ్డి ఆశీర్వాదం–అండతో బొమ్మారెడ్డిపల్లిని ధర్మారం మండలంలోనే అగ్రగామి గ్రామంగా మారుస్తానని పేర్కొన్నారు.
గ్రామంలోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుండి పనిచేస్తానని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు అందించడం, డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయించడం, బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేయడమే తన ధ్యేయమని తెలిపారు.
ఆమె తరపున భర్త నర్సయ్య గడపగడపకు వెళ్లి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ముందడుగు వేయాలన్న సంకల్పంతోనే ఈ ఎన్నికల్లో అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, గ్రామ ప్రజల సహకారంతో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకంతో ముల్కల అంజలి నర్సయ్య ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
