ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం..
బొమ్మకల్ రోడ్డులోని సత్యం సిమెంట్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో బీహార్ రాష్ట్రానికి చెందిన సహనీ బిట్టు కుమార్ కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు పెద్దవాడు సత్యం కుమార్ (4), చిన్నవాడు ఆర్వన్ కుమార్ (2).
ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న సిమెంట్ పైపుల క్యూరింగ్ వాటర్ ట్యాంకు వద్ద ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా జారి అందులో పడిపోయారు. కొద్దిసేపటికే పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లి సుధాదేవి వెతకసాగింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు ఆర్యన్ నీటి ట్యాంకులో తేలియాడుతూ కనిపించాడు.
ఆమె కేకలు వేయగా అక్కడికక్కడే కార్మికులు పరుగెత్తుకొచ్చి పిల్లలను పైకి తీసారు. అప్పటికే పెద్ద కొడుకు సత్యం కుమార్ కూడా నీటిలో చిక్కుకుపోయాడు. స్థానికులు వెంటనే ప్రయత్నించి నీరు బయటకు తీయగా కొంత శ్వాస కనిపించడంతో తండ్రి బిట్టు కుమార్‌తో కలిసి వారిని కరీంనగర్‌లోని ఆదర్శ ఆసుపత్రికి తరలించారు.
అయితే, అప్పటికే ఇద్దరు బాలురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ నిరంజన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బొమ్మకల్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.


