రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై లారీ ట్రాలీ పడటంతో నుజ్జునుజ్జు అయ్యి కారులోని ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బికనీర్ లోని దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ కారులో మహిళ సహా ఆరుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. కారు దేశ్ నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే లోడ్ తో వెళుతున్న ఓ ట్రక్ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, కారుపై పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటనపై సమాచారం అందుకున్న దేశ్ నోక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.
ఒక క్రేన్, మూడు జేసీబీల సహాయంతో ట్రాలీని తొలగించారు. కారు మొత్తం ట్రాలీలోని బూడిదతో నిండిపోయింది. కారులో ప్రమాదానికి గురైన వ్యక్తులను బయటికి తీసి, అంబులెన్స్ లో పీఎంబీ ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ వెల్లడించారు. ఘటనపై పోలీస్ అధికారి సునీల్ మాట్లాడుతూ.. కారులో ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, వీరంతా మరణించినట్లుగా డాక్టర్ చెప్పారని తెలిపారు. చనిపోయిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తున్నట్లుగా గుర్తించామని, ప్రస్తుతానికి మృతులను గుర్తించలేదని, మృతదేహాలను పీఎంబీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని చెప్పారు.