రైతుల రాస్తారోకో..
- మెయిన్ రోడ్డుపై నిలిచిన వాహనాలు
- పోలీసుల జోక్యంతో రాస్తారోకో విరమణ
- తహశీల్దార్, సీసీఐ అధికారులతో రైతుల చర్చలు
- ఎట్టకేలకు వాపస్ వెళ్లిన రైతులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించేందుకు కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App) స్లాట్ బుకింగ్ ద్వారా గురువారం 84 మంది రైతులు బుక్ చేసుకున్నారు. సిసిఐ కొనుగోలు కేంద్రానికి సుమారు 40 ట్రాక్టర్ లు ఇతర వాహనాలలో గురువారం ఉదయమే రైతులు తమ పత్తిని తీసుకొచ్చారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 నుండి 12 శాతం తేమ ఉంటే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. కేంద్రానికి చేరుకున్న ట్రాక్టర్లలో తేమశాతాన్ని అధికారులు పరిశీలించగా 13 శాతం నుండి 16 శాతం(13 percent to 16 percent) వరకు ఉండడంతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరించారు. దీంతో రైతులు విసిగివేసారి మోత్కూర్- నార్కట్పల్లి మెయిన్ రోడ్డుపై మిల్లు ఎదుట పత్తి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలు జరగకుండా పెద్ద ఎత్తున రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు.
దీంతో సీఐ వెంకటేశ్వర్లు(CI Venkateshwarlu) ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులకు సీసీఐ నిర్వాహకులతో మాట్లాడిస్తామని సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. తాము బుక్ చేసుకున్న స్లాట్ కాస్త సాయంత్రం 5 గంటల తర్వాత క్యాన్సల్ అవుతుందని, కిరాయి వాహనాల్లో పత్తిని విక్రయించేందుకు తెచ్చామని, అధికారులు కొనుగోలు చేయకపోతే తాము ఏం చేయాలా అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
తహశీల్దార్ జ్యోతి(Tahsildar Jyoti) సంఘటన స్థలాన్ని సందర్శించారు.సీసీఐ బయ్యర్ రవీందర్ ని పిలిపించి రైతులతో మాట్లాడించారు.ఎట్టకేలకు సీసీఐ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేయమని అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు అసహనంతో,నిరాశతో తమ పత్తి లోడ్ వాహనాలను వాపస్ తీసుకెళ్లారు. రైతులు ఎంతో ప్రాధేయపడినప్పటికి ….అధికారులు కనికరించలేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

