ఆర్టీఓ రూ.లక్షలు సమర్పయామి
కొద్ది సేపటికి తేరుకున్న ఆర్టీఓ.. పోలీసులకు ఫిర్యాదు
వరంగల్‌లో సంచలన ఘటన వెలుగులోకి..
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్ల మోసాలను తలదన్నేలా నకిలీ ఏసీబీ అధికారులు (Fake ACB Officials) తెరమీదకు వచ్చారు. ఆ నకిలీ ఏసీబీ కేటుగాళ్ల వలలో చిక్కి ఓ ఆర్టీఓ లక్షలు సమర్పించుకుని లబోదిబోమన్న ఉదంతం వరంగల్‌లో సంచలనం సృష్టించింది. వివరాలు.. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో ఉన్నతధికారిగా పనిచేస్తున్న జైపాల్ రెడ్డి తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
తాము ఏసీబీ (ACB) అధికారులమని.. కార్యాలయంలో అవినీతి జరుగుతుందని, దాడి చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంగారు పడిన సదరు అధికారి జైపాల్‌రెడ్డి వారు డిమాండ్ చేసిన మేరకు రూ.లక్షలు ముట్టజెప్పాడు. కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత నకిలీ అధికారులకు డబ్బులు పంపామని గమనించి మిల్స్ కాలనీ పోలీసుల (Mills Colony Police) ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపారు.
చెప్పి రైడ్ చేయం.. ఫోన్ అసలే చేయం…
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆర్‌టీఓ జయపాల్ రెడ్డి (RTO Jayapal Reddy) ఫిర్యాదు గురించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను వివరణ కోరగా అవినీతి జరుగుతున్న విషయం తెలిస్తే చెప్పి రైడ్ చేయమని.. ఫోన్లు చేసి డబ్బులు అడగమని చెప్పారు. అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఏసీబీ సాంబయ్య సూచించారు.