Exam | పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Exam | పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Exam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో తగినంత వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిఘా ఉంచాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
